గుజరాత్‌లో హై అలర్ట్‌!

Protesters block Rajkot-Somnath National Highway - Sakshi

అహ్మదాబాద్‌: మహారాష్ట్రలోని ‘భీమా–కోరేగావ్‌’ ఘటన సంబంధిత అల్లర్లు తాజాగా గుజరాత్‌కు పాకాయి. దీంతో గుజరాత్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. రాజ్‌కోట్‌-సోమ్‌నాథ్‌ జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి రోడ్డును నిర్బంధించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతుండటంతో పోలీసులు గుజరాత్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. భీమా-కోరేగావ్‌ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వర్గం చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారటంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. భీమా-కోరేగావ్‌ ఘటన సందర్భంగా దళితులపై దాడిని నిరసిస్తూ.. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) బహుజన మహాసంఘ్, దళిత నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బుధవారం ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముంబై, పుణే సహా రాష్ట్రమంతా స్తంభించిన సంగతి తెలిసిందే. గురువారం మహారాష్ట్రలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా.. ఆ ప్రకంపనలు తాజాగా గుజరాత్‌ను తాకాయి.

అఖిల భారత జాతీయ విద్యార్థుల సదస్సుకు బ్రేక్‌..!
భీమా-కోరేగావ్‌ హింస, తాజా పరిస్థితుల నేపథ్యంలో ముంబైలో తలపెట్టిన అఖిల భారత జాతీయ విద్యార్థుల సదస్సుకుపోలీసులు అనుమతి నిరాకరించారు. గుజరాత్‌ దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాని, జేఎన్‌టీయూ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ హాజరవుతుండటంతో ఈ సదస్సుకు చివరినిమిషంలో అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ సదస్సు కోసం వచ్చిన విద్యార్థులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తలపెట్టిన ఛాత్ర భారతి సభ్యులు జుహూ పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top