చాయ్‌ అమ్మిన గడ్డపై తొలిసారి!

PM visits birthplace Vadnagar, launches development wirks - Sakshi

సొంత పట్టణం వడ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన

చదువుకున్న పాఠశాల సందర్శన

అక్కడి మట్టిని తిలకంలా దిద్దుకున్న ప్రధాని

ఇక్కడి ప్రజల ప్రేమ, శివుడి ఆశీస్సులే విమర్శల గరళాల్ని స్వీకరించేలా చేశాయని వ్యాఖ్య

బాల్యంలో చాయ్‌ అమ్మిన గడ్డపై నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని హోదాలో అడుగుపెట్టారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దాదాపు మూడేళ్ల తరువాత సొంత పట్టణం వడ్‌నగర్‌లో పర్యటించారు. రోడ్‌ షోకు భారీగా హాజరైన జనసందోహాన్ని చూసి కాన్వాయ్‌ దిగి వారితో మమేకమయ్యారు. తాను చదువుకున్న బీఎన్‌ హైస్కూల్‌ను సందర్శించారు. అక్కడే భావోద్వేగంతో నేలపైనున్న మట్టిని బొటనవేలితో తీసుకుని తిలకంలా దిద్దుకున్నారు. పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రధాని ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, భోలేనాథుడి ఆశీస్సులే తననీ స్థాయికి తెచ్చాయన్నారు.

వడ్‌నగర్‌:  ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రెండోరోజు పర్యటన సందర్భంగా మోదీ తను పుట్టిన ఊరు వడ్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలిసారిగా పుట్టిన ఊరికి వచ్చిన మోదీకి వడ్‌నగర్‌లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రోడ్‌షోలో భారీ సంఖ్యలో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మోదీ కాన్వాయ్‌ దిగి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత తాను చదువుకున్న పాఠశాలను సందర్శించారు. వడ్‌నగర్‌లోని రైల్వేస్టేషన్‌లోనే మోదీ అప్పట్లో చాయ్‌ అమ్మేవారనే సంగతి తెలిసిందే.  ‘వడ్‌నగర్‌ ప్రజలు చూపించిన ప్రేమను చూసి గర్వపడుతున్నాను. దేశానికి మరింత ఉత్సాహంగా సేవచేసేందుకు ఈ ప్రజాభిమానం కొత్త శక్తినిచ్చింది. నాతో మాట్లాడేందుకు వచ్చిన వారందరినీ చూస్తుంటే బాల్యం గుర్తుకొచ్చింది’ అన్నారు.

వడ్‌నగర్‌ ఇచ్చిన కానుకిదే!
వడ్‌నగర్‌లో కొత్తగా నిర్మించిన మెడికల్‌ కాలేజీని మోదీ ప్రారంభించారు. టీకాల కార్యక్రమాన్నీ ప్రారంభించిన మోదీ పలువురు చిన్నారులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో సంభాషించారు. అనంతరం బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘నా ప్రయాణం వడ్‌నగర్‌ నుంచి మొదలైంది. నేనిప్పుడు కాశీకి చేరుకున్నా. వడ్‌నగర్‌ (శతాబ్దాల పురాతన శివాలయం ఉంది) లాగే.. కాశీ కూడా భోలేనాథుడి క్షేత్రం.

శివుడి ఆశీర్వాదం నాకు ఎనలేని శక్తినిచ్చింది. ఇది వడ్‌నగర్‌ నుంచి నాకు అందిన గొప్ప కానుక. శివుడి ఆశీర్వాదంతోనే నాకు విషాన్ని జీర్ణించుకునే శక్తి వచ్చింది. ఈ ఆశీర్వాదం కారణంగానే 2001 నుంచి నాపై విషం చిమ్ముతున్న వారందరికీ సమాధానం ఇవ్వగలుగుతున్నా’ అని అన్నారు. వడ్‌నగర్‌ తనకు గరళాన్ని కంఠంలో దాచుకోవటాన్ని నేర్పిందాన్నరు.  

యూపీఏకు వైద్య విధానమే లేదు
దేశవ్యాప్తంగా నేటి వైద్యరంగ దురవస్థకు యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణమని మోదీ దుయ్యబట్టారు. ‘యూపీఏ ప్రభుత్వ విధానాల వల్ల తక్కువ మందికే వైద్య కళాశాలల్లో సీట్లు దక్కేవి. దీని కారణంగా దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. అందుకే మేం ప్రతీ మూడు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాలను స్థాపించాలని నిర్ణయించాం’ అని మోదీ అన్నారు.

ప్రభుత్వ చొరవతో స్టెంట్లు, మందుల ధరలు భారీ తగ్గాయన్నారు. భరూచ్‌లో గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్, కెమికల్స్‌లో రూ.550 కోట్లతో కెమికల్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీంట్లో ఏడాదికి 2లక్షల మిలియన్‌ టన్నుల డై కాల్షియం ఫాస్పేట్‌ ఉత్పత్తి అవుతుంది.     

‘విస్తృత మిషన్‌ ఇంద్రధనుష్‌’ ప్రారంభం
దేశంలో ఏ చిన్నారీ నిర్మూలన సాధ్యమైన వ్యాధుల ద్వారా బాధపడకూడదని ప్రధాని పేర్కొన్నారు. విస్తృతమైన టీకా కార్యక్రమం ‘ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌’ (ఐఎంఐ)ను వడ్‌నగర్‌లో మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రెండేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికీ, వ్యాధినిరోధక టీకాలు తీసుకోని గర్భిణులందరికీ టీకాలు అందజేయనున్నారు. ప్రధాని ప్రారంభించటంతోనే అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా 2018 జనవరి వరకు ఏడురోజుల టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా 173 జిల్లాలు, 17 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020 కల్లా దేశంలో ప్రతి చిన్నారికీ టీకాలు అందాలని సంకల్పించిన ప్రభుత్వం.. 2018 డిసెంబర్‌లోపే 90 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఐఎంఐ పథకాన్ని ప్రారంభించింది. నాలుగు దశల్లో అమలుచేసిన మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా నేటివరకు రూ.2.53 కోట్ల మంది చిన్నారులు, 68 లక్షల మంది గర్భిణులకు వ్యాధినిరోధక టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రి నడ్డా స్పష్టం చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top