
మంత్రి నిర్లక్ష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది.
భోపాల్: కోవిడ్ నిబంధనలు పాటించి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు.. అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ప్రభుత్వలో కీలకంగా వ్యవహరించే మంత్రులు సైతం తమకేమీ పట్టవన్నట్టు గుంపుల్లో చేరిపోతున్నారు. మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరమన్న మాటే ఎరగకుండా మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ (48) ఎంచక్కా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంఘటన రాహత్‌ఘాట్‌లో శనివారం ఉదయం వెలుగుచూసింది. మంత్రి నిర్లక్ష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది.
కాగా, మధ్యప్రదేశ్ బీజేపీ పెద్దలు కరోనా నిబంధనలు ఉల్లంఘించడం కొత్తేమీ కాదు. కోవిడ్ హాట్‌స్పాట్ ఇండోర్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి రాష్ట్ర బీజేపీ వైఎస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి ఇక్కడ 10 వేల కేసులు నమోదవగా.. 447 మంది మరణించారు.
(చదవండి: ‘కరోనా దేవి’కి కేరళలో నిత్య పూజలు)