నన్ను నేను చూసుకోలేక పోయాను: మహిమా చౌదరి

Mahima Chaudhry Opens Up On Horrific Accident - Sakshi

బాలీవుడ్‌ నటి మహిమా చౌదరి తన జీవితంలో జరిగిన భయానక ప్రమాదం గురించి వెల్లడించారు. ఆ యాక్సిడెంట్‌ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. బతకడం కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహిమా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నేను కాజోల్‌, అజయ్‌ దేవగణ్‌‌ల సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ‘దిల్‌ క్యా కరే’ చిత్రం కోసం పని చేస్తున్నాను. బెంగళూరులో షూటింగ్‌ జరుగుతుంది. స్టూడియోకు కార్‌లో వెళ్తుండగా నాకు ఓ పెద్ద యాక్సిడెంట్‌ జరిగింది. ఓ ట్రక్కు నా కారును ఢీకొట్టింది. గ్లాస్‌ మొత్తం నా ముఖం లోపలకు వెళ్లినట్లు అనిపించింది. నేను చనిపోతున్నానని అనుకున్నాను. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఎవరూ నాకు సహాయం చేయలేదు. నేను ఆసుపత్రికి చేరుకున్న చాలా సేపటి తరువాత నా తల్లి, అజయ్ వచ్చారు. నేను లేచి అద్దంలో నా ముఖం చూసుకుని భయపడ్డాను. డాక్టర్లు నాకు శస్త్రచికిత్స చేసి 67 గాజు ముక్కలను తీశారు’ అని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ఆ సంఘటన యొక్క జ్ఞాపకాలు మహిమా చౌదరిని ఉద్వేగానికి గురిచేశాయి. ‘ఆ ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు నాకు దుఖం వస్తుంది. ఆపరేషన్‌ తర్వాత నా ముఖం మీద కుట్లు ఉన్నాయి. నేను ఇంట్లోనే ఉండాలి.. సూర్యరశ్మి తగలకూడదు. నా గది పూర్తిగా చీకటిగా ఉంటుంది.  అద్దం లేదు. యూవీ కిరణాల కాంతిని వెదజల్లే లైట్లు ఉండవు’ అని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం ఆమె కెరీర్‌ను పూర్తిగా దెబ్బ తీసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్‌ సమయంలో నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని నేను వదులు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జనాలు నాకు మద్దతుగా నిలవలేదు. వారు ‘ఆమె ముఖం నాశనం అయ్యింది.. ఆమెను తీసేసి మరొకరిని తీసుకుందాం’ అని భావించారు. దాంతో నేను ఆ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top