ఆసియాన్‌లో ఉల్లాసంగా !

PM Modi briefly meets Donald Trump, world leaders at ASEAN gala dinner - Sakshi

సదస్సు సందర్భంగా వివిధ దేశాధినేతలతో మోదీ మాటామంతీ

నేడు ట్రంప్, ద్యుతెర్తెతో చర్చలు  ∙రేపు సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం

మనీలా: మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ‘ఆసియాన్‌–భారత్‌’, ‘తూర్పు ఆసియా’ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా చేరుకున్నారు.అనంతరం ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఇచ్చిన ఈ విందులో మోదీ అందరితో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, జపాన్‌ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్స్‌ జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్‌ టాగలాంగ్‌’ను ధరించి విందులో పాల్గొన్నారు. పలువురు నేతలతో ముచ్చటిస్తున్న ఫొటోల్ని ప్రధాని మోదీ ట్వీటర్‌లో పోస్టు చేశారు. 

నేడు అమెరికా అధ్యక్షుడితో చర్చలు
ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల వేదికగా జరిగే ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు దేశాధ్యక్షులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్, రష్యా ప్రధాని మెద్వెదెవ్‌తో ఆయన చర్చలు జరుపుతారు. సోమవారం ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతా పరిస్థితితో పాటు పరస్పర ప్రయోజన అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు చెక్‌ చెప్పేందుకు భారత్‌ ముఖ్య పాత్ర పోషించాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ద్యుతెర్తెతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు.  

పలు అంశాలను ప్రస్తావించనున్న మోదీ
మంగళవారం ఆసియాన్‌–భారత్, తూర్పు ఆసియా సదస్సుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు, తిరుగుబాటు ధోరణిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ విధాన రూపకల్పనపై ఒత్తిడి తీసుకురావడం, ప్రాంతీయ వాణిజ్య ప్రోత్సాహంపై ఈ సదస్సుల్లో మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఆసియాన్‌ సదస్సులో వాణిజ్యం, పెట్టుబడుల అంశాలతో పాటు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి, ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షల అంశాల్ని..  తూర్పు ఆసియా సదస్సులో మ్యారీటైం భద్రత, ఉగ్రవాదం, అణు నిరాయుధీకరణ, వలసలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆసియాన్‌ బిజినెస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో పాల్గొనడంతో పాటు ‘రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌’(ఆర్‌సీఈపీ)లో సభ్య దేశాల నేతలతో కూడా సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారతీయ సమాజం ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, మహావీర్‌ ఫిలిప్పీన్స్‌ ఫౌండేషన్‌ను మోదీ సందర్శిస్తారు.  ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి జైదీప్‌ మజుందార్‌ మాట్లాడుతూ.. ‘ఇండో–ఫసిపిక్‌లో భారత్‌ మరింత కీలకంగా వ్యవహరించాలని ఆసియాన్‌లోని ప్రతీ దేశం కోరుతుంది’ అని పేర్కొన్నారు. తూర్పు ఆసియా సదస్సులో ‘ఆసియాన్‌’ సభ్య దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా పాల్గొంటున్నాయి.  

చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యం!
వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భద్రతా సహకారంపై చర్చించేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆ స్ట్రేలియా అధికారులు తొలిసారి మనీలాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా మార్చే అంశంపై ఈ నాలుగు దేశాలు చర్చించాయి. పరస్పర ప్రయోజనమున్న అంశాలపై కూడా చర్చలు కొనసాగాయి. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తూ‘ ఇండో–పసిఫిక్‌పై మరిన్ని చర్చలు కొనసాగించాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అమలయ్యేలా సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించాం’ అని పేర్కొన్నాయి. కలిసికట్టుగా పనిచేసేలా, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా చర్చలు సాగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదం, ఉగ్రవ్యాప్తిపై కూడా సమావేశంలో చర్చించారని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top