కేంద్రం సత్యం

Chandrababu Is Always Follows PM Modi - Sakshi

అక్షర తూణీరం

అన్ని దేశాల వాస్తుకి సరిపోయేలా 33 వేల ఎకరాల నేలని చూపిస్తే అది హాట్‌ కేక్‌ అవుతుందని బాబు కలలు కన్నారు. అదంత వీజీ కాదని తేలింది.

చంద్రబాబు బాగా ఇరుకున పడ్డాడని కొందరు అనుకుంటున్నారు. సమస్యే లేదు, వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొనే సామర్థ్యం ఉంది. పొలస చేపలా వరద గోదారికి ఎదురీదగలడని ఇంకొందరంటున్నారు. పొత్తిళ్లనాటి నించి చంద్రబాబు గంపెడాశలతో మోదీ వెనకాల ఆవు వెంట దూడ వలె తిరుగుతున్న మాట నిజం. ఆఖరికి మోదీ చాటపెయ్యని చూపించి, చేపించి పాలు పిండుకున్నారని కొందరు వ్యాఖ్యా నిస్తున్నారు. 

కొన్ని బిల్లులు ఇవ్వకపోయినా, చాలా బిల్లులకు ప్రధానికి బాబు సహకరించారని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మోదీకి చంద్రబాబు పాలనమీద పూర్తి నమ్మకం ఉంది. ఘటనాఘటన సమర్థుడని విశ్వాసం ఉంది. అందుకే చంద్రబాబు భుజంమీద మోది చెయ్యి వేశారని చెబుతారు. అవసరమైతే ఏ భాష సభ్యులనైనా ఓ గొడుగు కిందికి చేర్చగల పనితనం చంద్రబాబుకి ఉందని పెద్దాయనకి గట్టి నమ్మకం. ఇక ఇట్నించి చూస్తే– వాజ్‌పేయి హయాంలోలాగే ఆవకాయ వాటంగా, నల్లేరుమీద బండి చందంగా నడిచి పోతుందనుకున్నారు. బాబుకి ప్రమాణ స్వీకారం దగ్గర్నించి మోదీ హయాం గతుకుల రోడ్డుగానే అనిపిస్తోంది. కుదుపులు, మలుపులు బాగానే ఇబ్బంది పెడుతున్నాయ్‌.

ఎన్టీఆర్‌ ‘కేంద్రం మిథ్య’ అని ప్రతిపాదిస్తే చంద్రబాబు ‘కేంద్రం సత్యం’ అని విభేదించారు. మనం కేంద్రంతో గొడవపడితే, కష్టాతికష్టం అది నష్టాతినష్టం అని తాను నమ్మి ఏపీతో నమ్మించారు. మనం తెలివిగా స్నేహ భావంతో ఉన్నట్టే ఉండి మనక్కావల్సిన నిధులు రాబట్టుకోవాలి. నేనేదో చేస్తున్నానని ఎన్నోసార్లు నొక్కి వక్కాణించారు.

సరిగ్గా మోదీ కూడా స్నేహ భావం విషయంలో అదే వ్యూహంతో ఉన్నారు. మిత్రపక్షం కుంపట్లో చంద్ర బాబు పప్పులు ఉడకలేదు. గోలవరం తప్ప పోలవరం కదల్లేదు. ప్రపంచ ప్రసిద్ధ కాపిటల్‌లో మొదటి అక్షరం కూడా పడలేదు. ప్రధాని ప్రత్యేక విమానంలో ఉదారంగా తెచ్చిన మృత్తికలు, గంగాజలం మాత్రం ప్రజకి బాగా గుర్తుంది. 33 వేల ఎకరాల నేలని అన్ని దేశాల వాస్తుకి సరిపోయేలా చూపిస్తే అది హాట్‌ కేక్‌ అవుతుందని బాబు కలలు కన్నారు. అదంత వీజీ కాదని తేలింది. గుగ్గిళ్ల మూటని చూస్తూ పరిగెత్తిన గుర్రంలా నాలుగేళ్లు చంద్రబాబు భ్రమలో ఉన్నమాట నిజం. ఇప్పుడు మార్గాంతరం లేదు. గేరు మార్చి ప్రత్యేక హోదా జిందాబాద్‌! ప్యాకేజి డౌన్‌ డౌన్‌ అని అరుస్తున్నారు. 

మిత్రపక్షంలో ఉంటామంటూనే ఒకటిన్నర మంత్రి పదవుల్ని త్యాగం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం చేజారి ఇంకోరి చేతుల్లోకి పోతుందేమోనని టీడీపీకి భయం. వైఎస్సార్‌సీపీ వైపు బీజేపీ మొగ్గుతుందేమోనని తెలుగుదేశంకి పీడకలలు వస్తున్నాయి. తృతీయఫ్రంట్‌ అనే ఓ గడి ఖాళీగా ఉంది. చంద్రబాబు ఆ గడిలోకి రాకుండా కేసీఆర్‌తో మోదీయే కర్చీఫ్‌ వేయించాడని ఓ వదంతి ప్రచారంలో ఉంది. ఈ గందరగోళాల్లో వేలకోట్ల బ్యాంకు స్కాంలు, ఏపీ బడ్జెట్‌ పక్కకి వెళ్లి పోయాయి.

ఇంతా చేసి అంతా ఒకటే. మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌– ఎవరెవరితోనూ విభేదించరు. అనంత విశ్వంలో గ్రహాల్లా ఎవరి కక్ష్యలో వాళ్లు తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మాత్రం గ్రహణాలు తెప్పించుకుంటూ ఉంటారు. తర్వాత సంప్రోక్షణలు జరుగుతాయ్‌.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top