సులైమాన్‌ (అలై) తీర్పులు

Controversy of a farmer - Sakshi

వేల సంవత్సరాల పూర్వం ఇద్దరు రైతుల మధ్య వివాదం రాజుకుంది. అందులో ఒకరు పాడిరైతు కాగా, మరొకరు పంటరైతు. ఒకసారి పంటరైతు పొలంలో పాడిరైతు మేకలమంద పడి కాపుకొచ్చిన పంటనంతా పాడు చేసేసింది. మేకల రైతు తన మేకల దొడ్డి ద్వారాన్ని మూసివేయకుండా నిర్లక్ష్యం వహించడంతో మేకలన్నీ రైతు పొలాన్ని ఆ విధంగా నాశనం చేశాయి. భూమి రైతుకు తీవ్ర నష్టం జరిగింది. రైతు  సులైమాన్‌ (అలై) అనే ప్రవక్త దగ్గరకొచ్చి ఫిర్యాదు చేశాడు.

ఇద్దరి వాదనల్ని విన్న సులైమాన్‌ (అలై) ఈ మేకల మందను పంట యజమాని, పంటను మేకల యజమాని మార్చుకోవాల్సిందిగా తీర్పు చెప్పారు. ‘‘మేకల యజమాని పంటను పుష్కలంగా పండించి వచ్చిన ధాన్యాన్ని పంట యజమానికి అప్పగించాలి. పంట యజమాని మేకల పాలు పిండుకుని తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి. భూమి రైతుకు జరిగిన నష్టం తీరాక తిరిగి ఎవరివి వాళ్లు తిరిగి ఇచ్చేయాలి’’ అని ఇద్దరికీ ఆమోదయోగ్యమైన తీర్పు చెప్పారు.

ఓసారి ఇద్దరు మహిళలు ఒక చంటి పిల్లాడి కోసం కొట్లాడుతున్నారు. పిల్లాడు తన కొడుకు అంటే తన కొడుకు అని వాదులాడసాగారు. ఈ వివాదం సులైమాన్‌ (అలై) ముందుకెళ్లింది. ఇద్దరూ సులైమాన్‌ (అలై) ముందు తమ సమస్యను ఏకరువుపెట్టారు. సులైమాన్‌ (అలై) ఆ ఇద్దరు మహిళల్ని ఎదురుబొదురుగా నిల్చోబెట్టి చంటి పిల్లాడిని చేతుల్లో పట్టుకున్నారు. ఒరలో నుంచి ఖడ్గాన్ని తీసుకుని ‘‘ఈ పిల్లాడిని రెండు ముక్కలు చేసి సమానంగా పంచుతాను’’ అని చెప్పారు.

దీనికి ఒక మహిళ సరేనని సంతోషంగా ఒప్పకుంది. ఇంకో మహిళ మాత్రం తల్లడిల్లిపోయింది. ‘‘చక్రవర్తి గారూ అంతపని చెయ్యకండి. ఆ పిల్లాడిని ఆమెకే అప్పగించండి’’ అని ప్రాధేయపడసాగింది. సులైమాన్‌ (అలై) ఆ చంటిపిల్లాడు ఆ మహిళ బిడ్డే అని గ్రహించారు. పిల్లాడిని అసలు తల్లికి అప్పజెప్పారు. ఈ రెండు గాథల్ని ఖుర్‌ఆన్‌ పరోక్షంగా ప్రస్తావించింది.
–  ముహమ్మద్‌ ముజాహిద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top