కాంగ్రెస్ లో చేరిన దాసోజు | dasoju join to congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ లో చేరిన దాసోజు

Apr 13 2014 12:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ లో చేరిన  దాసోజు - Sakshi

కాంగ్రెస్ లో చేరిన దాసోజు

టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, నగర నాయకులు కాచం సత్యనారాయణ గుప్తా, ఉస్మానియా టీఎస్ జేఏసీ కన్వీనర్ కొనగాల మహేష్ సహా పలువురు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఓయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ మహేశ్, మరికొందరు టీఆర్‌ఎస్ నేతలు కూడా..
చేరిన వెంటనే టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా శ్రవణ్ నియామకం
టీఆర్‌ఎస్‌లో అంతా కుటుంబ పాలనే: శ్రవణ్


హైదరాబాద్: టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, నగర నాయకులు కాచం సత్యనారాయణ గుప్తా, ఉస్మానియా టీఎస్ జేఏసీ కన్వీనర్ కొనగాల మహేష్ సహా పలువురు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో... కేంద్రమంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వెంటనే శ్రవణ్‌ను టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు పొన్నాల ప్రకటించారు. కాగా... టీఆర్‌ఎస్ కుటుంబ పాలనగా మారిపోయిందని శ్రవణ్ ఈ సందర్భంగా ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి  వల్ల తెలంగాణకు న్యాయం జరగదనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణ లక్ష్యం సాకారమైన నేపథ్యంలో... ఉద్యమంలో పోరాడిన వారికి పదవులు దక్కాల్సిన అవసరముందని, ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

సోనియా, రాహుల్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో 107 కేసులను ఎదుర్కొని 32 రోజుల జైలు శిక్ష అనుభవించానని ఉస్మానియా టీఎస్ జాక్ కన్వీనర్ మహేష్ చెప్పారు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ... తెలంగాణ ద్రోహులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న కేసీఆర్‌ను ఎండగట్టేందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. కాగా.. సమావేశ మందిరంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకురావడంతో తోపులాట జరిగి.. టీఆర్‌ఎస్ నేతల చేరిక కార్యక్రమం రసాభాసగా మారింది. జైరాం రమేశ్, పొన్నాల ఎంతగా సర్దిచెప్పినా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఈ సమయంలో కాంగ్రెస్‌లో చేరేందుకు వచ్చిన శ్రవణ్ అనుచరులను జైరాం నెట్టివేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దామోదర రాజనర్సింహ అసహనం వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన మాజీ మంత్రి జానారెడ్డి వేదిక వద్దకు రాకుండానే వెనుదిరిగారు.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement