ఇదేం నిర్వాకం బాబూ?! | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 17 2018 12:49 AM

Sakshi Editorial On Chandrababu Failure In Thithili Cyclone Rescue Operations

తిత్లీ తుపాను పొరుగునున్న ఒరిస్సాతోపాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించి అప్పుడే వారం కావస్తోంది. గత బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ 165 కిలోమీటర్ల పెను వేగంతో తన ప్రతాపం చూపిన ఆ మహమ్మారి ధాటికి జిల్లా మొత్తం చిగురాటాకులా వణికింది. అక్కడి ప్రజలంతా దాదాపు 12 గంటలపాటు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణమొక యుగంగా గడిపారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. లక్షల హెక్టార్లలో పంటలన్నీ నీట మునిగాయి. కొబ్బరి, జీడి తోటలు తుడిచిపెట్టుకుపోయి పెను నష్టం వాటిల్లింది. జిల్లాలో సగటున 77 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందంటే తుపాను తీవ్రత ఎంతటిదో తెలుస్తుంది. దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఈ తుపానులో చిక్కుకున్నారు. 

ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. విరుచుకుపడ బోయే విపత్తు తీవ్రత ఎంతటిదో, దానివల్ల ఏ ఏ ప్రాంతాలు దెబ్బతినే ప్రమాదముందో అంచనా వేసుకుని, ముందస్తు చర్యలు తీసుకోవడం మాత్రమే ఏ ప్రభుత్వమైనా చేయగలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించటం, సహాయ బృందాలను హుటాహుటీన రంగంలోకి దించి ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడటం వంటివి చేస్తే ప్రాణనష్టం కనిష్ట స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మంచినీరు, పాలు, కూరగాయలు, ఇతర నిత్యా వసరాలు వగైరాలకు కొరత లేకుండా చూడాలి. ముఖ్యంగా సంక్షోభాన్ని ఆసరా చేసుకుని జనాన్ని నిలువుదోపిడీ చేయడానికి తయారయ్యేవారిపై కన్నేసి ఉంచాలి. ఎక్కడెక్కడ నష్టం వాటిల్లిందో, తక్షణ సాయం అందించాల్సిన ప్రాంతాలేవో లెక్కలేసి అవసరమైన సిబ్బందిని, సామగ్రిని తర లించాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో వారం గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా దొరక్క కష్టాలు పడుతున్న ప్రజానీకాన్ని చూస్తుంటే, వారు చెబుతున్న కన్నీటి గాథలు వింటుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నదా అనే అనుమానం కలుగుతుంది. ఒకపక్క తాను ప్రకృతినే హ్యాండిల్‌ చేశానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వోత్కర్షకు పోతున్నారు. వాస్తవంలో మాత్రం తుపానులో చిక్కుకున్న లక్షలమంది ప్రజలు ఆరురోజులుగా అష్టకష్టాలూ పడుతున్నారు. తమను పరామర్శించడానికొచ్చిన మంత్రులను, తెలుగుదేశం నేత లను ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు చెవులకు వినబడటం లేదో లేక ఆయన వినదల్చుకోలేదో తెలియదు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పూండిలో మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్‌ని స్థానికులు చుట్టుముట్టారు. అయిదురోజుల నుంచి గుక్కెడు నీళ్లు లేక, తినడానికేమీ దొరక్క అలమటిస్తుంటే తీరిగ్గా ఇప్పుడొస్తారా అని ప్రజలు ఆగ్రహించారు. నానా అగచాట్లూ పడుతున్నామని చంటిపిల్లల తల్లులు, వృద్ధులు చెప్పారు. రహదారులపై పడిన చెట్లను తామే తొలగించుకోవాల్సి వచ్చిందని, ఇన్ని రోజులుగా అధికారులు లేదా ప్రజా ప్రతినిధుల జాడే లేదని నిలదీస్తున్న ప్రజలకు పోలీసు లను చూపించి బెదిరించడం మినహా వారు తగిన జవాబివ్వలేకపోయారు.

హుద్‌హుద్‌ తుపాను సమయంలో చంద్రబాబు ఎన్ని గొప్పలు పోయారో అందరికీ గుర్తుంది. సరిగ్గా నాలుగేళ్లక్రితం ఇదే నెలలో హుద్‌హుద్‌ విరుచుకుపడినప్పుడు ఆయన అయిదు రోజులు అక్కడే మకాం వేశారు. తనతోపాటు మంత్రుల్ని, ఉన్నతాధికార గణాన్ని మోహరించారు. వీరంతా కలిసి అక్కడ జరిగే సహాయ, పునరావాస కార్యక్రమాలకు అడ్డు తగులుతూ హంగామా సృష్టిం చడం తప్ప చేసిందేమీ లేదు. వార్డులవారీగా మంత్రులనూ, ఉన్నతాధికారులనూ ఇన్‌చార్జిలుగా నియమించి సర్వం కదిలించేస్తున్నట్టు, అన్నీ బ్రహ్మాండంగా అమలవుతున్నట్టు మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు జరుపుతూ హడావుడి చేశారు. కానీ తమకు కనీసావసరాలుకూడా అందుబాటులో లేవని బాధితులు ఆవేదన చెందారు. అప్పుడు మాత్రమే కాదు...ఆ తర్వాత కూడా చంద్రబాబు సర్కారు చేసిందేమీ లేదు. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ప్రాంతంలో దేన్నీ సరిగా పునరుద్ధరించలేకపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతినగా, 10,000 ఇళ్లు నిర్మిస్తామని అప్పట్లో బాబు హామీ ఇచ్చారు. ఇప్పటికి అతి కష్టం మీద 3,000 ఇళ్లు పూర్తిచేశామనిపించారు. రోడ్లు సైతం నాలుగేళ్ల తర్వాత కూడా అధ్వా న్నంగానే ఉన్నాయి. ప్రభుత్వ నిర్వాకాన్ని చూపడానికి ఎక్కడో మారుమూలకు వెళ్లనవసరం లేదు. విశాఖ నగరంలోనే అనేక ప్రభుత్వ భవనాలు ఇప్పటికీ శిథిలావస్థలోనే ఉన్నాయి. వీటిని పునరు ద్ధరించాలన్న స్పృహే కొరవడింది. పంటనష్టానికి, పశు నష్టానికి పరిహారం ఊసేలేదు. 

బంగాళాఖాతం తరచుగా అల్లకల్లోలం కావటం, వాయుగుండాలు, తుపానులు ఏర్పడటం ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమీ కాదు. అటువంటి సమయాల్లో తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. జనావాసాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి. భారీగా పంట నష్టం సంభవిస్తోంది. ఏటా కనీసం రెండు లేదా మూడుసార్లు ఇదంతా తప్పడం లేదు. విపత్తులు కొత్త కానప్పుడు వాటిని ఎదుర్కొ నడంలోనూ తగినంత అనుభవం వచ్చి ఉండాలి. సహాయ, పునరావాసాల చర్యల్లో లోటు పాట్లుండ కూడదు. కానీ చంద్రబాబు సర్కారు దేన్నీ నేర్వటం చేతగాని మొద్దబ్బాయి తీరును తలపిస్తోంది. నాలుగేళ్లక్రితం సంభవించిన హుద్‌హుద్‌ తుపాను నాటి పరిస్థితులే ఇప్పడూ ఉండటం, పౌరులు రోజుల తరబడి పస్తులుండే దుస్థితి ఏర్పడటం ఎంత ఘోరం! గత అను భవాలను సమీక్షించుకుని, అందులోని లోటుపాట్లు గ్రహించి అవి పునరావృతం కాకుండా ఏం చేయాలో మదింపు వేసుకుంటే సమస్యలుండవు. అంతేతప్ప గతంలో అంత చేశాం, ఇంత చేశా మంటూ గప్పాలు కొట్టుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేది శూన్యం. ఇప్పటికైనా బాబు ప్రభుత్వం చురుగ్గా కదిలి ఉద్దానం తుపాను బాధితులను తక్షణం ఆదుకోవాలి.
 

Advertisement
 
Advertisement