వసూల్‌ రాజా..

Chandrababu Naidu Community Corruption Police Officer In Prakasam - Sakshi

ఆయన ఆడిందే ఆట నెలకు రూ.40 లక్షలు వసూలు

చీమకుర్తి, మద్దిపాడుల్లో మకాం చీమకుర్తిలో పంచాయితీలన్నీ ఆయనవే

క్వారీ యాక్సిడెంట్లు బయటకు రానీయరు

సీఎం సామాజికవర్గం పేరుతో యథేచ్ఛగా దందా

ఉన్నతాధికారులను ఖాతరు చేయని వైనం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆయన ఓ పోలీస్‌ అధికారి. పైగా ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇంకేముంది..!  ఆయన ఆడిందే ఆట.... పాడిందే పాటగా నడుస్తోంది.  చీమకుర్తిలో మకాం వేసి అక్రమ వసూళ్ల పర్యవేక్షణ ఆయన పని. క్వారీల్లో జరిగే యాక్సిడెంట్లను బయటకు రాకుండా చూస్తారు. ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకుంటారు. క్వారీ, ఫ్యాక్టరీ యజమానులు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ల మధ్య నిత్యం ఆయన పంచాయితీలు చేస్తారు. అందుకే అందరూ ఆయనకు నెల మామూళ్లు క్రమం తప్పకుండా సమర్పిస్తారు. ఒక్క చీమకుర్తి, మద్దిపాడు ప్రాంతాల నుంచి ఆయనకు వచ్చే నెల రాబడి రూ.35 లక్షల పైమాటే. చాలా కాలంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఆయన విధుల్లో ఉంటున్నారు. ఇంతకు ముందు ఆయన చీమకుర్తిలో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో అంతకు మించిన పదవిలో ఉన్నారు. సీఎం సామాజికవర్గం పేరు చెప్పి ఉన్నతాధికారుల మాటలను కూడా ఆయన పెడచెవిన పెడతారు. ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోరు. ఇక ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులుగా ఉన్న బాధితులు స్టేషన్‌కు వస్తే ఆయన ఏ మాత్రం స్పందించరు. సదరు అధికారి వసూళ్ల పర్వాన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని వర్గాల వారు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సొంత శాఖ నుంచే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పది నిమిషాల పాటు ఆయన స్టేషన్‌లో కూర్చుంటే కింది స్థాయి సిబ్బంది ఆయన గురించి గుసగుసలాడుకోవడం కనిపిస్తోంది. 

చీమకుర్తి ప్రాంతంలో 60 క్వారీలు, వాటికి అనుబంధంగా మరో 30 క్వారీలు కలిపితే మొత్తం 90 క్వారీలు ఉన్నాయి. నెలకు ఒక్కో క్వారీ నుంచి రూ.15 వేలు ఆ పోలీస్‌ అధికారికి మామూలు కింద సమర్పించాల్సిందే. ఇక 70 కంకర మిల్లులు ఉండగా  ఒక్కో కంకర మిల్లుకు రూ.5 వేల చొప్పున ఆయనకు నెల మామూలు ఇవ్వాల్సిందే. ఇక 300 ఫ్యాక్టరీలలో  ఒక్కో ఫ్యాక్టరీ నుంచి నెలకు రూ.2 వేలు చొప్పన సదరు అధికారి జేబులోకి వెళ్లాల్సిందే. ఈ లెక్కన క్వారీల పరిధిలో నెలకు రూ.13.50 లక్షలు, ఫ్యాక్టరీల పరిధిలో రూ.6 లక్షలు, 70 కంకర మిల్లుల పరిధిలో రూ.3.50 లక్షలు చొప్పున  మొత్తం నెలకు రూ.21 లక్షలు సదరు పోలీస్‌ అధికారికి నెల మామూళ్ల కింద చెల్లిస్తున్నారు. ఇక క్వారీ యాక్సిడెంట్లు, లారీ ట్రాన్స్‌పోర్టు వసూళ్లు తదితర వాటిని కలిపితే నెలకు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు సమర్పించాల్సిందే. చీమకుర్తి కాకుండా మద్దిపాడు పరిధిలో ఉన్న 90 ఫ్యాక్టరీలు నెలకు రూ.5 వేలు చొప్పున రూ.4.50 లక్షలు, గ్రానైటు అక్రమ రవాణాకు సంబంధించి మరో రూ.5 లక్షలు కలిపి నెలకు దాదాపు రూ.10 లక్షలు ఆ పోలీస్‌ అధికారికి ముట్ట చెప్పాల్సిందే. ఈ లెక్కన నెలకు రూ.40 లక్షలకు తగ్గకుండా పోలీస్‌ అధికారి అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి.

గ్రానైట్‌ క్వారీల ప్రమాదాలు జరిగినప్పుడు ఆయనే ముందుండి పంచాయితీలు చేస్తారు. కేసులు నమోదు కాకుండా చూస్తారు. మూడు నెలల క్రితం చీమకుర్తి పరి«ధిలోని ఓ క్వారీలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. పత్రికల వారికి ఇదే విషయాన్ని పోలీసులు చెప్పారు. అయితే వాస్తవంగా గ్రానైట్‌ క్వారీల్లో పేలుళ్ల కోసం ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలు ఉరుములు, మెరుపులతో పేలడంతో క్వారీలో ఇద్దరు కార్మికులు చనిపోయినట్లు ఆ తర్వాత తెలిసింది. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌  క్వారీల్లో జరిగే ప్రమాదాలు బయటకు రాకుండా సదరు పోలీసు అధికారి అన్నీ తానై చూసుకుంటారు. వీటితో పాటు చీమకుర్తి ప్రాంతంలో ట్రాన్స్‌పోర్టు గొడవలు సైతం ఆయనే పరిష్కరిస్తుంటారు.  సదరు అధికారి చీమకుర్తిలో మకాం వేయడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధమే కారణమన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఈయనతో అనుబంధాన్ని పెంచుకున్న సదరు మహిళ కొంత కాలం ఒంగోలుకే మకాం మార్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీతో ఎనలేని అనుబంధాన్ని పెంచుకున్న సదరు పోలీసు అధికారి పోలీసు ఉన్నతాధికారులను ఖాతరు చేయడన్న ప్రచారం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన ఒంగోలు ఎమ్మెల్యేతో పాటు సీఎం సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఈయన ఆడిందే ఆటగా సాగుతోంది. ఆయన అధికార పార్టీ మద్దతుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటారని ఆశాఖకు చెందిన పలువురు పేర్కొంటుండడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top