దేశీ స్టార్టప్స్‌లో షావోమి పెట్టుబడులు!!

Xiaomi to invest Rs 6000-7000 crore in 100 Indian startups - Sakshi

ఐదేళ్లలో రూ.7,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లకు రెడీ

చండీగఢ్‌: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’... భారతీయ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతోంది. వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 100 స్టార్టప్స్‌లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రకటించింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో బలోపేతమవ్వడమే ఈ ఇన్వెస్ట్‌మెంట్ల ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది.

‘2017 నాటికి కంపెనీ నికర పెట్టుబడులు రూ.3,000 కోట్లు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లోని స్టార్టప్స్‌లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తాం’ అని షావోమి ఇండియా వైస్‌ ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్‌ తెలిపారు. మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీలో ఉన్న సంస్థల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు. దీని వల్ల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో సంస్థ బలోపేతమౌతుందని తెలిపారు.

స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో తమ ఆధిపత్యాన్ని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తంచేశారు. చైనాలో విక్రయిస్తోన్న ప్రొడక్టులను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు చెన్నైలో ఇటీవలనే ఒక ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో ఎలక్ట్రిక్‌ సైకిల్, సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్, స్మార్ట్‌ షూ, స్మార్ట్‌ కుకర్, ల్యాప్‌టాప్, వాటర్‌ ప్యూరిఫయర్‌ వంటి వాటిని అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఈ ఉత్పత్తులపై కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నామని, ఇక్కడి పరిస్థితులకు అనువైన మార్పులతో వీటిల్లో కొన్ని ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రతిదాన్ని స్మార్ట్‌గా, ఇంటర్నెట్‌ ఆధారంగా, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పనిచేసేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top