వచ్చే ఏడాది జీడీపీ రయ్‌ రయ్‌!

Fitch Ratings For The Economy Growing - Sakshi

2021–22లో 9.5 శాతం వృద్ధి రేటు

ఫిచ్‌ రేటింగ్స్‌ సానుకూల అంచనాలు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఫిచ్‌ రేటింగ్స్‌ ఎంతో సానుకూల అంచనాలను వెలువరించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) జీడీపీ వృద్ధి రేటు ప్రతికూల (మైనస్‌) శ్రేణిలోకి వెళ్లిపోతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో మాత్రం వేగంగా పుంజుకుని 9.5 శాతానికి వృద్ధి చెందుతుందన్న అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే నిదానించిన భారత ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి 2020–21లో మరింత కుంగదీస్తుందని, జీడీపీ వృద్ధి మైనస్‌ 5 శాతానికి క్షీణిస్తుందని పేర్కొంది.

‘‘కరోనా మహమ్మారి భారత వృద్ధి ధోరణిని బలహీనపరిచింది. దీంతో అధిక ప్రజా రుణ భారం కారణంగా ఏర్పడిన సవాళ్లు అది భరించలేదు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం అనంతరం భారత జీడీపీ ‘బీబీబీ’ కేటగిరీలోని ఇతర దేశాల కంటే మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడిపోకుండా ఇది ఆదుకుంటుంది’’ అని ఏపీఏసీ సార్వభౌమ క్రెడిట్‌ అంచనాల పేరుతో బుధవారం విడుదల చేసిన నివేదికలో ఫిచ్‌ రేటింగ్స్‌ భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది. మార్చి చివరి వారంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిపోయిన విషయం తెలిసిందే.

ఉద్దీపనలు చాలా తక్కువ 
‘‘ప్రభుత్వం జీడీపీలో 10% మేర ఉద్దీపనల చర్యలను ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు జీడీపీలో ఒక శాతమే. తోటి దేశాలతో పోలిస్తే ఇది ఎంతో తక్కువ’’ అంటూ ఫిచ్‌ రేటిం గ్స్‌ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. 2019– 20లో ప్రభుత్వ రుణం జీడీపీలో 70%కి చేరుకుందని, బీబీబీ రేటింగ్‌ సగటు 42% కంటే ఎంతో ఎక్కువని పేర్కొంది. అదే విధంగా ప్రజా రుణం 2020–21లో జీడీపీలో 84%కి చేరుకుంటుందని, 2019 డిసెంబర్‌ నాటికి తాము వేసిన 71% అంచనాల కంటే ఎక్కువని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.

భారత రేటింగ్‌ కొనసాగింపు: ఎస్‌అండ్‌పీ  
భారత సార్వభౌమ రేటింగ్‌ను దీర్ఘకాలానికి ప్రస్తుత ‘బీబీబీ మైనస్‌’ స్థిర అవుట్‌లుక్‌ను.. అదే విధంగా సల్పకాల కరెన్సీ ఇష్యూలకు ఏ–3గా కొనసాగిస్తున్నట్టు ఎస్‌అండ్‌పీ బుధవారం ప్రకటించింది. వృద్ధికి సంబంధించి సమస్యలు పెరుగుతున్నాయంటూనే.. 2021 నుంచి ఆర్థిక, ద్రవ్యపరమైన పరిస్థితులు కుదురుకుంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ‘‘కరోనా వైరస్‌ను కట్టడి చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న అంచనాల ఆధారంగానే స్థిరమైన అవుట్‌లుక్‌ ఇస్తున్నాం. భారత దీర్ఘకాల వృద్ధి రేటుకు సవాళ్లు పెరుగుతున్నాయి.

అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కరణలను చక్కగా అమలు చేసినట్టయితే దేశ వృద్ధి రేటు తోటి దేశాల కంటే ముందుంటుంది’’ అని ఎస్‌అండ్‌పీ తన నివేదికలో పేర్కొంది. బీబీబీ మైనస్‌ అన్నది పెట్టుబడులకు కనిష్ట రేటింగ్‌. భారత్‌ విషయంలో ఎస్‌అండ్‌పీ 13 ఏళ్లుగా ఇదే రేటింగ్‌ను కొనసాగిçస్తుండటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్‌ 5%కి పడి పోతుందని, 2021–22లో 8.5%కి పుం జుకుంటుందని, 2022–23లో మాత్రం 6.5%కి పరిమితమవుతుందనేది ఎస్‌అండ్‌పీ అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top