ఎగుమతులు రయ్‌.. | Sakshi
Sakshi News home page

ఎగుమతులు రయ్‌..

Published Wed, Jan 17 2018 12:39 AM

Exports rise 12.36 percent to $27 bn in Dec - Sakshi

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్‌లో ఎగుమతులు 12.36 శాతం మేర వృద్ధి చెందాయి. విలువపరంగా 27.03 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ముడిచమురు, పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో ఇంపోర్ట్‌ బిల్లు సైతం 21.12 శాతం ఎగిసి రూ. 41.91 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన చూస్తే డిసెంబర్‌లో 41 శాతం ఎగిసి 14.88 బిలియన్‌ డాలర్లకు చేరింది.

 ‘గతేడాది అక్టోబర్లో 1.1 శాతం తగ్గుదల మినహా.. 2016 ఆగస్టు నుంచి 2017 డిసెంబర్‌ దాకా ఎగుమతుల ధోరణి సానుకూలంగానే నమోదవుతూ వస్తోంది‘ అని కేంద్రం పేర్కొంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు.. మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఎగుమతులు.. గతేడాది నవంబర్‌లో 26.19 బిలియన్‌ డాలర్లు కాగా, 2016 డిసెంబర్‌లో 24.05 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

300 బిలియన్‌ డాలర్ల మైలురాయి దాటతాం: ఎఫ్‌ఐఈవో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలోనే 224 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ గణేశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. 2018లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి మెరుగ్గా ఉండనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం 300 బిలియన్‌ డాలర్ల మైలురాయిని సులభంగా దాటేయగలమని ధీమా వ్యక్తం చేశారు.

 2015–16లో మొత్తం ఎగుమతులు 262 బిలియన్‌ డాలర్లు కాగా, 2016–17లో 275 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. దిగుమతులు దేశీయంగా ఉత్పత్తికి తోడ్పడేవేనా లేక సవాలుగా మారే అవకాశముందా అన్న అంశాన్ని పరిశీలించాలని గుప్తా పేర్కొన్నారు.  మరోవైపు, పన్ను విభాగం అధికారుల మొండివైఖరి, అవగాహన లేమి కారణంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రీఫండ్‌ పొందటంలో ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
ఇక వివిధ ఉత్పత్తుల ఎగుమతులు, 

దిగుమతుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.
మొత్తం 30 ప్రధాన ఉత్పత్తుల్లో 21 ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి నమోదు చేశాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, సేంద్రియ.. నిరింద్రియ రసాయనాలు, వజ్రాభరణాలు, ఔషధాలు వీటిలో ఉన్నాయి. 

ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి 25 శాతం.

రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతులు 8 శాతం క్షీణించి 1.33 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయ్యాయి.

పసిడి దిగుమతులు 71.5 శాతం ఎగిసి 3.39 బిలియన్‌ డాలర్లుగా నమోదు. 2016 డిసెంబర్‌లో ఈ పరిమాణం 1.97 బిలియన్‌ డాలర్లే.

పెట్రోలియం ఉత్పత్తులు, ముడిచమురు దిగుమతులు 35% పెరిగి 7.66 బిలియన్‌ డాలర్ల నుంచి 10.34 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య తొమ్మిది నెలలకాలంలో ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది 223.51 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సుమారు 22 శాతం పెరిగి 338.37 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 114.85 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

Advertisement
Advertisement