‘రాయల’ అంటే..రగడే | we won't accept royala telangana | Sakshi
Sakshi News home page

‘రాయల’ అంటే..రగడే

Dec 4 2013 4:50 AM | Updated on Aug 11 2018 7:54 PM

తెరపైకి వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనే తమ లక్ష్యమంటూ మరోసారి ప్రజాసంఘాలు రోడ్డెక్కాయి.

 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్

 తెరపైకి వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనే తమ లక్ష్యమంటూ మరోసారి ప్రజాసంఘాలు రోడ్డెక్కాయి. ఎట్టి పరిస్థితిల్లో ఈ ప్రతిపాదనను అంగీకరించేది లేదంటూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారుు. జిల్లావ్యాప్తంగా తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్, న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థి, ప్రజాసంఘాలు మంగళవారం చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో ఓరుగల్లు దద్దరిల్లింది. 

 

      తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేటలో తెలంగాణవాదులు భారీ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. జేఏసీ నాయకుడు అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

      వరంగల్ ఎంజీఎం సెంటర్‌లో మెడికల్ జేఏసీ

 

      ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రణరంగమేనని చైర్మన్ నాగేంద్రబాబు హెచ్చరించారు.

 

  తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పితే పుట్టగతులుండవని జేఏసీ చైర్మన్ తిరుణహరి శేషు హెచ్చరించారు.

 

  హన్మకొండలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కోర్టు ఎదుట 72 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సంపూర్ణ తెలంగాణ సాధించుకునే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అడ్వకేట్ జేఏసీ నాయకులు సహోదర్‌రెడ్డి, అంబరీష్, సునిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

  టీఆర్‌ఎస్ యూత్ నగర కమిటీ ఆధ్వర్యంలో కాళోజీ సెంటర్‌లో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల కల ఫలిస్తుందనుకుంటున్న తరుణంలో మళ్లీ కుట్రలు ప్రారంభించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ యూత్ నాయకుడు బోడ డిన్నా తదితరులు పాల్గొన్నారు.

 

  కేయూ రెండో గేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

  మహబూబాబాద్‌లో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు పద్మాకర్‌రావు, డేగల సత్యనారాయణలు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు రాయల తెలంగాణ భూతం ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలియజేశారు. జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ. ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

 

  తొర్రూరు లో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

  పరకాలలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ నాయకులు పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, నరేష్‌రెడ్డి పాల్గొన్నారు.

 

  మరిపెడలో ఆంక్షలు లేని తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దంతాలపల్లిలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

  హసన్‌పర్తిలో ఓయూ ఎమ్మార్పీఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. లింగస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement