వివాహిత అనుమానాస్పద మృతి | Married dead | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

May 6 2014 3:29 AM | Updated on Sep 2 2017 6:58 AM

పలమనేరులో ఒక వివాహిత సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదనపు కట్నం కోసం భర్తే ఆమెను చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  • అదనపు కట్నం కోసం భర్తే చంపేశాడని బంధువుల ఆరోపణ
  • ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
  •  పలమనేరు టౌన్, న్యూస్‌లైన్: పలమనేరులో ఒక వివాహిత సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదనపు కట్నం కోసం భర్తే ఆమెను చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి కథనం మేరకు.. గంగాధర నెల్లూరు మండలం ఒగ్గువారిపల్లెకు చెందిన చంద్రయ్య కుమార్తె రాసా (23)కు పలమనేరుకు చెందిన సుబ్బయ్య కుమారుడు అర్జున్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది.

    రాసా తల్లిదండ్రులు పెళ్లి చేయడమేగాక రూ.2 లక్షల నగదు, ఏడు సవర్ల  నగలు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం రోజులు కాపురం సజావుగా సాగింది. నాలుగు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ అర్జున్ భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని రాసా తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. వారం రోజుల క్రితం ఆటో కొనుగోలు చేసేందుకు లక్ష రూపాయలు కావాలంటూ అర్జున్ భార్యతో గొడవపడ్డాడు. అత్తమామలు అప్పుచేసి రూ.50వేలు ఇచ్చారు.

    మిగిలిన రూ.50వేల కోసం వేధింపులు ప్రారంభించాడు. తన తల్లిదండ్రుల వద్ద ఇక డబ్బు లేదని రాసా చెప్పినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన భార్య ఉరేసుకుని కొన ఊపిరితో ఉందంటూ అర్జున్ చుట్టుపక్కల వారికి తెలిపాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

    అర్జున్ పరారయ్యాడు. కుమార్తె మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. తమ బిడ్డను అల్లుడే చంపి, నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు. మృతురాలికి ఏడాదిన్నర వయస్సు గల బిడ్డ ఉంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement