బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట తరగని అవినీతి ఊట | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట తరగని అవినీతి ఊట

Published Wed, Nov 7 2018 7:51 AM

ACB Attack on Break Inspector Home - Sakshi

విశాఖ క్రైం: తవ్వుతున్నకొద్దీ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శరగడం వెంకటరావు అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. వాటని చూసి అవాక్కవడం ఏసీబీ అధికారుల వంతవుతోంది. తాజాగా తాటిచెట్లపాలెం 80 అడుగుల రోడ్డులో నివాసముంటున్న వెంకటరావు డ్రైవర్‌ మోహన్‌రావు, అతని బావ కిరణ్‌కుమార్‌ ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శరగడం వెంకటరావు కుటుంబ సభ్యులకు సంబంధించిన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. సుమారు కోటి రూపాయలు విలువ గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లతో పాటు రూ.4.5 లక్షల నగదు గుర్తించారు. సబ్బవరం మండలంలోని అరిపాక, బంగారురాజుపాలెంలో కుటుంబ సభ్యుల పేరు మీద కొన్న భూముల పత్రాలు లభ్యమయ్యాయి. మరోవైపు ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో మరికొంత మందిని ఏసీబీ అధికారులు విచారించారు.

ఆశ్చర్యపోతున్న ఏసీబీ అధికారులు
సోదాల్లో వెలుగుచూస్తున్న వెంకటరావు అక్రమాస్తులు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో శరగడం వెంకటరావు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో శనివారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మార్కెట్‌ ధర ప్రకారం రూ.30కోట్లకు పైగానే అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అనంతరం వెంకటరావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోదాలలో భాగంగా సోమవారం బ్యాంకు లాకర్లు తెరవగా మూడు కిలోల బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమాదేవి మాట్లాడుతూ కొటక్‌ మహేంద్ర, ఆంధ్రాబ్యాంక్, గౌరి కో ఆపరేటివ్‌ బ్యాంక్, ఎస్‌బీఐలలో ఫిక్సిడ్‌ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు రూ.40కోట్లకుపైనే ఉంటాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు, అక్రమాస్తుల లోగుట్టు తెలుసుకునేందుకు మరో రెండు రోజులు సోదాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement