breaking news
break inspector
-
బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇంట తరగని అవినీతి ఊట
విశాఖ క్రైం: తవ్వుతున్నకొద్దీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శరగడం వెంకటరావు అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. వాటని చూసి అవాక్కవడం ఏసీబీ అధికారుల వంతవుతోంది. తాజాగా తాటిచెట్లపాలెం 80 అడుగుల రోడ్డులో నివాసముంటున్న వెంకటరావు డ్రైవర్ మోహన్‌రావు, అతని బావ కిరణ్‌కుమార్ ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శరగడం వెంకటరావు కుటుంబ సభ్యులకు సంబంధించిన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. సుమారు కోటి రూపాయలు విలువ గల ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు రూ.4.5 లక్షల నగదు గుర్తించారు. సబ్బవరం మండలంలోని అరిపాక, బంగారురాజుపాలెంలో కుటుంబ సభ్యుల పేరు మీద కొన్న భూముల పత్రాలు లభ్యమయ్యాయి. మరోవైపు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మరికొంత మందిని ఏసీబీ అధికారులు విచారించారు. ఆశ్చర్యపోతున్న ఏసీబీ అధికారులు సోదాల్లో వెలుగుచూస్తున్న వెంకటరావు అక్రమాస్తులు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో శరగడం వెంకటరావు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో శనివారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మార్కెట్ ధర ప్రకారం రూ.30కోట్లకు పైగానే అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అనంతరం వెంకటరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోదాలలో భాగంగా సోమవారం బ్యాంకు లాకర్లు తెరవగా మూడు కిలోల బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమాదేవి మాట్లాడుతూ కొటక్ మహేంద్ర, ఆంధ్రాబ్యాంక్, గౌరి కో ఆపరేటివ్ బ్యాంక్, ఎస్బీఐలలో ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు రూ.40కోట్లకుపైనే ఉంటాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు, అక్రమాస్తుల లోగుట్టు తెలుసుకునేందుకు మరో రెండు రోజులు సోదాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
రూ.100 కోట్లు..నో బ్రేక్!
సాక్షి, అమరావతి /తిరుపతి క్రైం: రేణిగుంట చెక్‌పోస్ట్‌లో ఎంవీఐగా పనిచేస్తున్న పసుపులేటి విజయభాస్కర్‌పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అతని ఆస్తులు రూ.4.5 కోట్లు ఉంటాయని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లపైగానే ఉంటాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..పద్మావతిపురం పంచాయతీలోని శ్రీనివాసపురంలో ఉన్న ఇంటితో పాటు, బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి 16ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెంగళూరులోని 4 ప్రదేశాల్లో, అనంతరంపురంలో ఓ చోట, చిత్తూరు జిల్లాలో పదిచోట్ల, చెన్నైలోని ఓ ప్రాంతంలో, బంధువులకు చెందిన, బినామీ పేర్లతో సుమారు రూ.8కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెండు లాకర్లను గుర్తించారు. కడప జిల్లా, నందలూరు మండలం, శేషామాంబపురానికి చెందిన పి.సుబ్బరాయుడు కుమారుడు పి.విజయభాస్కర్ (51) 1993లో అగ్నిమాపకశాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2005లో బదిలీపై రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. పలమనేరు చెక్‌పోస్టు , కడప డీటీసీ ఆఫీసులో 2014 వరకు విధులు నిర్వహించాడు. 2011లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక టివి చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి సస్పెండ్ అయ్యాడు. 2014లో ఇతనికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పలుమార్లు తనిఖీల్లో పట్టుబడిన ఆయనపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆర్సీవో కేసు నమోదు చేశారు. ఇంట్లో వందల కొద్ది పత్రాలు, బాండ్లు, నగదు, వెండి, విలువైన వస్తువులు, వాహనాలను గుర్తించారు. కొంతకాలంగా రాజకీయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఆయన సన్నిహితులు కూడా రాజంపేట ఎమ్మెల్యే టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. విజయభాస్కర్ మొదటి భార్య త్రిపురసుందరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి నెల్లూరు కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ ఏఎస్ఈ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. గుర్తించిన ఆస్తులివే... - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/3 నిందితుడు పి.విజయభాస్కర్ భార్య త్రిపురసుందరి పేరుతో ఉన్న రూ.228.69లక్షల ఇళ్లస్థలం 20 గుంటలు - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/5 విజయభాస్కర్ పెద్దమ్మ కామాక్షమ్మ , రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.81.90లక్షల ఇళ్లస్థలం7.52 గుంటలు - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.168,ఆర్ఎస్నం.262 విజయభాస్కర్ రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.11లక్షల ఇళ్లస్థలం 1.39 ఎకరాలు - కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వేనం.902/391/3ఎ1, 1500–2 పచ్చిపుల సుదర్శన్‌కుమార్ పేరుతో రూ.4లక్షల వ్యవసాయ భూమి 7.21 ఎకరాలు - కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వే నం 227/2ఎన్2లో పచ్చిపుల వెంకటసుబ్బయ్య పేరుతో రూ.0.20లక్షల 0.37 ఎకరాలు - బెంగళూరులో హోబ్లీ కృష్ణరాజపుర, దేవచంద్ర గ్రామంలో తన రెండో భార్య పి.ధనలక్ష్మి తండ్రి డి.కృష్ణ పేరు మీద రూ.16.02లక్షల 1800 చదరపు అడుగులున్న రెండు ప్లాట్లు - చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని గౌతమ్‌నగర్‌లో రెండో భార్య పి.ధనలక్ష్మి పేరుతో రూ.26 లక్షల 306 అడుగులున్న ఇల్లు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు.. - బెంగళూరులోని కనకపుర మెయిన్‌రోడ్డులోని గ్రేస్ క్రియేషన్స్ క్లాత్ డిజైనింగ్ కంపెనీలో 2011లో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. - బెంగళూరు మైసూర్ రోడ్డులోని కుంభలగోడు ఇండస్ట్రియల్ ఏరియాలోని గ్రేస్టెక్స్ప్రో ఫ్యాక్టరీ (ఎంబ్రయిడరీ మిషన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ)లో 2011లో రూ.30లక్షల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. చరాస్తులు.. - విజయభాస్కర్ మొదటి భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.29లక్షలు - రెండో భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.53.33లక్షలు - గుర్తించిన నగదు 7.72లక్షలు - సంతకం చేసిన రూ.110.00లక్షల విలువైన 6 ఖాళీ చెక్కులు - రూ.57.00లక్షల విలువైన 12 ప్రామిసరీ నోట్లు - సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు 25 - బ్యాంకు బ్యాలెన్స్ రూ.53లక్షలు - గోల్డ్ 350 గ్రాములు, సిల్వర్ 2 కేజీలు - ద్విచక్ర వాహనం ఒకటి, హోండా యాక్టివా, ఫోర్‌వీలర్స్ 2 (విలువ రూ.29లక్షలు) - 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని ఇంకా పరిశీలించలేదు. -
అత్తారింటికి దారిలో...
బ్రేక్ ఇన్స్పెక్టర్ మామూళ్ల కక్కుర్తి అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంకటాచలం: ప్రయాణంలో ఉన్నా చేతి వాటం కుదురుగా కూర్చోనివ్వలేదు. ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ అత్తారింటికి వెళ్తూ దారిలో మామూళ్లు వసూలు చేసుకుపోదామనుకున్నారు. కానీ పోలీసులకు దొరికిపోయి మరో ‘అత్తారింటికి’ వెళ్లారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్గేట్ వద్ద స్థానిక ఎస్సైకి విజయవాడకు చెందిన బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి పట్టుబడిన వివరాల్లోకి వెళితే.. వెంకటగిరిలోని తన అత్తగారింటికి భర్త, అత్తతో కలసి విజయవాడ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి ఆదివారం బయలుదేరారు. సాయంత్రం 6.30గంటల సమయంలో వెంకటాచలం టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు గేదెలను చెన్నైకు తీసుకెళుతున్న మూడు లారీలు వచ్చాయి. వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి కారుడ్రైవర్ ఆ లారీలను ఆపాడు. ఒక్కొక్కరు రూ.30 వేలు ఇవ్వాల్సిందిగా లారీడ్రైవర్లను డిమాండ్ చేశారు. వారు అంత ఇచ్చుకోలేమనడంతో కొంతసేపు వాదన జరిగింది. ఈ సమయంలో వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సైను చూసి బ్రేక్ఇన్స్పెక్టర్ కారును హడావుడిగా నెల్లూరువైపు యూటర్న తీయించారు. ఇది గమనించి ఎస్సై తన సిబ్బందితో కారును అడ్డగించి బ్రేక్ ఇన్స్పెక్టర్ను, ఆమె భర్తను, అత్తను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వారు లారీడ్రైవర్ల నుంచి తీసుకున్న రూ. 1,500ను కూడా స్వాధీనం చేసుకున్నారు. టోల్‌గేటు వద్దే కేసు నమోదు చేసి వారిని పోలీస్‌స్టేషన్ తరలించారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఎస్సై రాత్రి 10 గంటల వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. డ్రైవరు కక్కుర్తి పడ్డాడు! ఈ విషయమై బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణిని పోలీసులు వివరణ కోరగా తమ కారు డ్రైవరు కక్కుర్తిపడి మామూళ్లు వసూలు చేశాడన్నారు. ఆ వసూళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారు.