ఆల్మట్టి ఎత్తుపై నోరు మెదపని బాబు
కడప సెవెన్‌రోడ్స్: కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం తలపెడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కడపలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1995లో అల్మట్టి సామర్థ్యం 17.82 టీఎంసీలేనని పేర్కొన్నారు. దేవెగౌడను ప్రధానమంత్రిని చేసింది తానేనంటూ జబ్బలు చరుచుకునే చంద్రబాబు అప్పట్లో దేవెగౌడ అల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్లకు పెంచడం ద్వారా 129 టీఎంసీలను వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టినా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 519.6 మీటర్ల నుంచి 524.6 మీటర్ల ఎత్తుకు అల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తద్వారా 279 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం డీపీఆర్ చేపట్టి దానికి టెండర్లు సైతం పిలిచిందన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. అల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా ఆ రాష్ట్రం 279.72 టీఎంసీలను వాడుకుంటుందన్నారు. అల్మట్టి ఎత్తు పెంపుపై మహరాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన సందర్భంలో తెలంగాణలోని టీడీపీ నాయకులతో చంద్రబాబు పిల్ వేయించారన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమతో ధర్నా నిర్వహింపజేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు కలిగించింది కూడా చంద్రబాబే అన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోతానన్న భయంతోనే ఆయన రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మేల్కొకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి నష్టమే జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రైతు నాయకుడు వాసుదేవరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్‌కుమార్, ఫయాజ్ పాల్గొన్నారు.
చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రాష్ట్రానికి నష్టమే
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి


