జాతీయ స్థాయిలో ‘ఆర్కే వ్యాలీ’ ప్రతిభ
వేంపల్లె : అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్ థాన్ జాతీయ స్థాయిలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఈనెల ఆరో తేదీన జాతీయ హ్యాక్ థాన్‌లో తమ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతిని కై వసం చేసుకోగా, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చెందిన రెండు జట్లు రన్నర్‌గా నిలిచాయన్నారు. 10 ముఖ్యమైన క్వాంటం అంశాలపై ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఈ హ్యాక్ థాన్‌లో పాల్గొనగా.. ఉత్తమంగా 100 జట్లు జాతీయస్థాయి ఎంపికై అర్హత సాధించినట్లు తెలిపారు. ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉండగా మొత్తం 600 మంది యువ ఆవిష్కర్తలు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. విజేతలకు ప్రతి సమస్యకు 50 వేల రూపాయల నగదు బహుమతి, రన్నర్స్‌కు 30 వేల రూపాయలు నగదు బహుమతితోపాటు జాతీయస్థాయి గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారన్నారు. ఈ విజయానికి కొనసాగింపుగా గత శనివారం ఏడవ తేదీన అమరావతిలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ ఫౌండేషన్ కార్యక్రమంలో విజేతలకు, రన్నర్స్– అప్‌లను ప్రముఖులు సత్కరించి అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ రత్నకుమారి, డీన్ అకాడమిక్స్ రమేష్ కై లాస్, ఫైనాన్స్ ఆఫీసర్ జి.రమేష్, పరీక్ష నియంత్రణ అధికారి అరుణ్‌కుమార్‌రెడ్డి, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, క్వాంటం టెక్నాలజీస్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పాల్గొన్నారు.


