పరిపూర్ణ విశ్వాసంతోనే మానవాళికి రక్షణ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: పరిపూర్ణ విశ్వాసంతోనే మానవాళికి రక్షణ భాగ్యం కలుగుతుందని, సకల జనులను రక్షించేందుకు లూర్దుమాత తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహించిందని రెవ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజ్, ఫాదర్ ధర్మరాజు అన్నారు. నవదిన పూజ ప్రార్థనల్లో భాగంగా ఆరవ రోజు శనివారం మరియాపురం పాత చర్చి ఆవరణలో ఫాదర్ ఆరోగ్య రాజ్ దివ్యబలి పూజను సమర్పించగా, ఫాదర్ ధర్మరాజు సీజేఏ దేవుని వాక్య సందేశాన్ని అందించారు. క్రీస్తు ప్రభువు నిర్దేశించిన మార్గం లోనే మనందరం నడవాలని సూచించారు. పాపకూపంలో కూరుకుపోయిన నేటి రోజుల్లో ప్రజలు దేవుడిని మరచిపోయి, ఇహలోక వ్యామోహాలతో బతుకుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని అన్నారు. మనుషులలో ఉన్నది దైవ క్రియలా? రాక్షస క్రియలా..? అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారు సూచించారు. ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న లూర్డుమాత తిరుణాల మహోత్సవంలో మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ సగిణాల పాల్ ప్రకాష్ దివ్య బలి పూజ సమర్పించనున్నారని, ఆ ప్రార్థనల్లో వేలాదిగా విశ్వాసులు పాల్గొని లూర్దుమాత దీవెనలు అందుకోవాలని కోరారు. పూజ ప్రారంభంలో ప్రత్యేకంగా అలంకరించబడిన లూర్డుమాత తేరును మరియాపురం పుర వీధుల గుండా భక్తిశ్రద్ధలతో జపమాలను జపిస్తూ ప్రదర్శించారు.
పరిపూర్ణ విశ్వాసంతోనే మానవాళికి రక్షణ


