ఏసీపీ నాగరాజు సస్పెన్షన్
ప్రొద్దుటూరు: స్థానిక జార్జికారొనేషన్ క్లబ్ వద్ద ఉన్న వెల్లాల టిఫెన్ సెంటర్‌కు గురువారం వెళ్లిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఐ.నాగరాజు 1/2 కాఫీ ఇవ్వాలని అడిగాడు. టిఫెన్ సెంటర్ నిర్వాహకుడు రామగోవిందరెడ్డి తమ షాపులో అలా ఇవ్వడం కుదరదన్నారు. దీంతో అహం దెబ్బతిన్న ఏసీపీ టిఫెన్ సెంటర్ ముందున్న ర్యాంప్‌ను డ్రైనేజీ కాలువపై నిర్మించావంటూ నిమిషాల్లోనే జేసీబీని తెప్పించి ర్యాంప్‌ను కూల్చే ప్రయత్నం చేయడం.. యజమాని జేసీబీ అడ్డుగా పడుకోవడం జరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని చోట్ల ఆక్రమణలను తొలగించిన తర్వాత తనది తొలగించాలని యజమాని పట్టుబట్టాడు. సమస్యను అధికారులకు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ అదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఏసీపీకి షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
● ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పనిచేస్తున్న ఐ.నాగరాజును సస్పెండ్ చేస్తూ టౌన్ అండ్ కంట్రిప్లానింగ్ డైరెక్టర్ ఆర్‌జే విద్యుల్లత శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణకు సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఏసీపీ సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు.
విధుల నుంచి డ్రైవర్ తొలగింపు
టిఫెన్ సెంటర్ వద్ద ర్యాంప్‌లను తొలగించేందుకు జేసీబీని తీసుకొచ్చిన ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ వెంకటేశ్వర్లును విధుల నుంచి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తొలగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఏసీపీ సస్పెండ్ కావడంతోపాటు ఆయన మాట విన్న డ్రైవర్ సైతం ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.


