గాయపడిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన యువకుడి మృతి

Feb 7 2026 10:02 AM | Updated on Feb 9 2026 11:41 AM

-

మైదుకూరు : మండలంలోని జీవీ సత్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంచాల సూర్య (21) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని జాండ్లవరం గ్రామానికి చెందిన సూర్య గురువారం మైదుకూరు నుంచి బైక్‌పై గ్రామానికి వెళుతుండగా జీవీ సత్రం హైస్కూల్‌ వద్ద యూటర్న్‌ తీసుకునే క్రమంలో కారు ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని మైదుకూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ట్రాక్టర్‌ ఢీకొని

వృద్ధురాలి దుర్మరణం

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని షేక్‌ కమాల్‌బీ(80) అనే వృద్ధురాలు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సున్నపుబట్టీల వీధిలో నివాసం ఉండే శ్రీను అనే వ్యక్తి ట్రాక్టర్‌ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఉదయం ట్రాక్టర్‌ తీసుకుని రాళ్ల కోసమని ప్రకాశ్‌నగర్‌లోకి వెళ్లాడు. రోడ్డుపైన ట్రాక్టర్‌ తిప్పుతుండగా అదే సమయంలో రోడ్డు పక్కన ఇంటిలో ఉన్న షేక్‌ కమాల్‌బీ అనే వృద్ధురాలు కసువు ఊడ్చడానికి ఇంటి బయటికి వచ్చింది. ట్రాక్టర్‌ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు ట్రాక్టర్‌ అదుపులోకి తీసుకున్నారు.

తెలుగుగంగ కాలువలో మరో యువకుడి మృతదేహం

బ్రహ్మంగారిమఠం : మండలంలోని ముడమాల ఎస్సీ కాలనీకి చెందిన కోడూరు సతీష్‌కుమార్‌(20) అనే యువకుడు శుక్రవారం చిన్నాయపల్లె వద్ద గల తెలుగుగంగ కాలువలో శవమై తేలాడు. స్థానికులు సమాచారంతో ఎస్‌ఐ శివప్రసాద్‌ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే కాలువలో గురువారం కూడా గుండాపురం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. 24 గంటలు కాక ముందే మరో యువకుడి శవం బయటపడటంతో పలు రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు యువకుల మృతి సమస్యలతో కూడిన ఆత్మహత్యలా లేక హత్యలా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మృత దేహాలకు చెందిన కుటుంబీకులు సరిగా స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి, శవాలను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement