లడ్డూ ప్రసాదంతోనే కూటమి సర్వనాశనం
ప్రొద్దుటూరు : దేవదేవుడైన శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంతోనే కూటమి ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం మహా కుట్రకు తెరతీసిందన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా మూడు పార్టీలు మహా అపచారం చేస్తున్నాయన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడానికి కారణం అప్పటి ఈఓ ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు అని ప్రచారం చేశారన్నారు. రాజకీయ స్వార్థంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే జగన్‌పై హిందువుల్లో వ్యతిరేకత కలిగించేలా విష ప్రచారం చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేశారని, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైవీ సుబ్బారెడ్డి సుంప్రీకోర్టును ఆశ్రయించగా ఆ మేరకు విచారణ జరిగిందన్నారు. తప్పు చేసి ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎందుకు కోర్టును ఆశ్రయిస్తుందని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత గొప్పదైన సీబీఐ విచారణ చేసి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నివేదిక ఇచ్చిందన్నారు. అప్పటి పాలకమండలికి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని సీబీఐ సిట్ నివేదిక ఇవ్వడంతో వెంకన్న భక్తులంతా సంతోషం వ్యక్తం చేశారన్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లాంటి వారికి మాత్రం ఎంతో బాధ కలిగిందన్నారు.
చంద్రబాబు కమిటీలను వేస్తూనే ఉంటాడు
ఏ సంస్థ దర్యాప్తు లేకుండానే గాలి మాటలు మాట్లాడిన కూటమి పార్టీ నేతలు అబద్ధాన్ని నిజం చేసేందుకు మరిన్ని కుట్రలకు తెర తీశారన్నారు. సిట్ నివేదికతో సంతృప్తి చెందకుండా మళ్లీ ఏక సభ్య కమిషన్‌ను నియమిస్తానని చంద్రబాబు చెప్పడం దేనికి నిదర్శనమన్నారు. లడ్డూ ప్రసాదంపై ఆయన అనుకున్నది రాయించుకునే వరకు విచారణ కమిటీలను వేస్తూనే ఉంటారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ బాణా కొండారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాచమల్లు శివప్రసాదరెడ్డి


