నా ఇంటిని నాకు ఇప్పించండి
నాయుడుపేట టౌన్: ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని సొంత తమ్ముడే తనకు ఇవ్వకుండా మోసం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, నా ఇంటిని నాకు ఇప్పించండని బాధిత మహిళ రామిశెట్టి వెంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి తన గోడును విలేకరులకు విన్నవించింది. పెళ్లకూరు మండలం కానూరు రాజుపాళెం గ్రామానికి చెందిన రామిశెట్టి వెంగమ్మ 2022లో కొండూరు వరప్రసాద్‌రాజు అనే వ్యక్తి వద్ద నుంచి 20 అంకణాల స్థలం కొనుగోలు చేసి రేకుల ఇళ్లు నిర్మించుకుంది. ఆమె ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని సొంత తమ్ముడే మోసం చేసి వేరే వారికి విక్రయించేశాడు. దీంతో తన ఇంటిని ఇప్పించాలని ఆమె పోలీసులు, అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వినతిపత్రం ద్వారా వివరించింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యేను కలిసి తనకు జరిగిన అన్యాయం వివరించినా తనకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా అధికారపార్టీ నాయకులు అధికారులకు చెప్పి తనకు ఇళ్లు దక్కనివ్వకుండా చేస్తున్నారని ఆమె వాపోయింది. సీఎంను కలిసి అందించిన వినతిపత్రం తిరుపతి జిల్లా ఎస్పీకి చేరడంతో ఆయన అక్కడి నుంచి నాయుడుపేట డీఎస్పీకు వినతిపత్రం చేరింది. దీంతో రెండు రోజుల క్రితం డీఎస్పీ కానూరు రాజుపాళేనికి వచ్చి విచారించి వెళ్లారని తెలిపింది. జిల్లా ఎస్పీ నుంచి వచ్చిన వినతి మేరకు వెంగమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఆమెకు సంబంధించిన ఇంటిని పరిశీలించామని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. అయితే ఆ ఇంటిని వెంగమ్మ అనుమతితోనే విక్రయించేసినట్లుగా చెబుతున్నారని పూర్తి స్థాయిలో విచారించి న్యాయం జరిగేలా చేస్తామని డీఎస్పీ వివరణ ఇచ్చారు.


