రాష్ట్రవ్యాప్తంగా.. ‘హాథ్‌ సే హాథ్‌’ యాత్రలు

From Today Congress Hath se Hath Jodo Yatra in Telangana - Sakshi

ప్రారంభించనున్న కాంగ్రెస్‌.. మేడారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ 

హాజరుకానున్న మాణిక్‌రావ్‌ ఠాక్రే..  ఇప్పటికే ములుగు చేరుకున్న పలువురు కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడోయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 26న లాంఛనంగా ప్రారంభమైన ఈ పాదయాత్రలను సోమవారం నుంచి రెండు నెలలపాటు కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే ములు­గు చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, బలరాంనాయక్, విజయరమణారావు, సిరిసిల్ల రాజయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరు­లు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లు పూర్తిచేశారు.  

ఉదయం 8కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రేవంత్‌ మేడారానికి బయలుదేరనున్నారు. ములుగుకు వెళ్లిన తర్వాత గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మేడారం చేరుకుని అక్కడ సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభించి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్‌ నగర్, పస్రా జంక్షన్‌ల మీదుగా రామప్ప గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసిన తర్వాత మలిరోజు ఆ గ్రామం నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారని, వారంపాటు అదే నియోజకవర్గంలో తన పాదయాత్ర సాగిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

బడ్జెట్‌ ఆమోదం తర్వాత భట్టి యాత్ర
హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే కూడా మేడారం వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలను ప్రారంభించేందుకు కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌కు ఆమోదం పొందిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ యాత్రలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరోవైపు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలందరూ సోమవారం తమ తమ నియోజకవర్గాల్లో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను ప్రారంభించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top