ప్రాణహిత పుష్కరాలకు వేళాయె..  | Sakshi
Sakshi News home page

ప్రాణహిత పుష్కరాలకు వేళాయె.. 

Published Mon, Apr 11 2022 2:35 AM

Telangana Pranahita Pushkaralu From April 13 To April 24 - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ప్రాణహిత పుష్కరాలను ఈనెల 13 నుంచి 24 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2010 తర్వాత ఈసారి స్వరాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 5 రోజులుగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారి, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఆదివారం కూడా పనులను పర్యవేక్షించారు.

తెలంగాణ–మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు.. గడ్చిరోలి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వద్ద.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సాధారణ ప్రజల కోసం ఒకటి, వీఐపీల కోసం మరొకటి ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రముఖ కాళేశ్వరంలో శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో భక్తులు 70 వేల నుంచి లక్ష వరకు కాళేశ్వరం చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, పుష్కరాల సందర్భంగా కంచిపీఠం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ కుటుంబ సభ్యులతో హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. పుష్కరాల ప్రారంభం రోజునే సీఎం కేసీఆర్‌ రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు.  

నిధుల విడుదలపై స్పష్టత కరువు.. 
2010లో ప్రాణహిత పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సారి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా కలెక్టర్‌ కోటా కింద రూ.49 లక్షలు మంజూరు చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి çఘాట్ల వద్ద తాత్కాలిక పనులు రూ.70 లక్షల అంచనాతో చేసేలా ఆ జిల్లా కలెక్టర్‌ భార తి హోళ్లికేరి అనుమతి ఇచ్చారు.

ఈ నిధులతో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలు మరుగు దొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర పనులు చేపట్టాయి. పుష్కరాల ప్రారంభానికి రెండు రోజులే ఉండగా, నిధుల మంజూరుపై స్పష్టత లేక అధికార యంత్రాంగం అయోమయంలో ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి కాళేశ్వరంలో లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement