రాజగోపాల్‌ది తీరని ద్రోహం.. విమోచన దినోత్సవంపై అవకాశవాద రాజకీయాలు.. విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి

Revanth Reddy Slams Congress Chargesheets Against TRS BJP Munugode - Sakshi

సాక్షి, నల్లగొండ: టీఆర్‌ఎస్‌, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు టీ పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి. శనివారం మునుగోడులో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ అనంతరం..  టీఆర్‌ఎస్‌, బీజేపీ వైఫల్యాలు, మోసాలపై.. తెలంగాణ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. 

బీజేపీ, టీఆర్‌ఎస్‌లది పక్కా అవకాశవాద రాజకీయం. రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుంది. టీఆర్‌ఎస్‌ పుట్టి ఎన్నేళ్లు అవుతోంది?. కాంగ్రెస్‌ ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నాడు ప్రధాని నెహ్రూ, పటేల్‌లు హైద్రాబాద్‌ను భారత దేశంలో విలీనం చేశారు. కాబట్టి, సెప్టెంబర్‌ 17ను ఏడాది పాటు ఘనంగా నిర్వహించుకుందాం. 

గత ఎనిమిదేళ్లుగా విమోచన దినోత్సవం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడేమో పోటాపోటీగా నిర్వహిస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మతం పేరుతో చిచ్చు పెడుతున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి.ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలనేది కాంగ్రెస్ కోరిక అని చెప్పారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ ఎవరికి లొంగిపోయాడు?. అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రాలే.. దళితులకు మూడెకరాల భూమి రాలేదు. తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. మునుగోడు అభివృద్ధికి నిధులు రాలేదు. అమ్ముడుపోయినోడికి, మోసం చేసినోడికి మాత్రమే నిధులు వచ్చాయి. 

అలాగే.. మునుగోడులో కాంగ్రెస్ బలమేంటో పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్‌. మునుగోడులో తమను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడనేది బహిరంగ రహస్యమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసింది. కానీ, ఆయన కాంగ్రెస్‌కు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ‘ధనిక రాష్ట్రాన్ని’ దోచుకుంటోందని ఆరోపించారు. అలాగే.. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు తెలంగాణకు దిక్సూచి కావాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, మల్లు రవి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రజల్లారా.. నిలదీయండి
టీఆర్ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయిందని అన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి. ప్రాజెక్టు పనులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేకా...ప్రమాదంలో చిక్కుకుందని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనను ప్రజలు బేరీజు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ అంశాలన్నింటిపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ప్రజలను ఆయన కోరారు. 

ఇదీ చదవండి:  కేసీఆర్ సర్కార్‌పై నిర్మలా సీతారామన్‌ ఫైర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top