మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
రిజర్వేషన్ బిల్లు అడ్డగింత చారిత్రక తప్పిదం
ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే రాహుల్, రేవంత్‌ల కుట్ర
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్, పునర్వీభజన బిల్లులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కేంద్రాన్నో, బీజేపీనో కాంగ్రెస్ ఓడించలేదని, 70 కోట్ల మంది మహిళలను ఓడించిందని చెప్పారు.
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం చూసేందుకే రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి ఈ బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా చేయడం కొత్తేమీ కాదని, గతంలో ఏడుసార్లు కుట్రలు చేసి మహిళా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. దేవెగౌడ, వాజ్‌పేయి ప్రభుత్వాల హయాంలో బిల్లు పేపర్లు చించి స్పీకర్, ప్రధానిపై వేశారని, మన్మోహన్‌సింగ్ హయాంలో మిత్రపక్షాలను ఉసిగొల్పి అడ్డుకునేలా నాటకాలాడారని మండిపడ్డారు.
దక్షిణాదికి తీరని ద్రోహం
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మొన్నటిదాకా గగ్గోలు పెట్టిన విపక్షాలు, ఇప్పుడు సీట్లు పెంచుకునే అవకాశం వస్తే అడ్డుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా తెలంగాణలో ఎంపీ స్థానాలను 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ స్థానాలను పెంచే ప్రయత్నం చేసిందని అన్నారు.
ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చినందుకు రాహుల్‌గాంధీ 30 కోట్ల మంది దక్షిణాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనికులు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్‌లను మాయాజాలంగా అభివర్ణించడం ద్వారా 140 కోట్ల మంది ప్రజలను, సైనికులను రాహుల్ అవమానించారన్నారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా చేశారా అని ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీని, తెలంగాణను పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీని లేదా మహిళను సీఎం చేసిందా? అని నిలదీశారు.


