కరోనా ప్రతాపం: ఆట పాటలకు టాటా!

Hyderabad: Corona Second Wave Effect On Childrens Playing - Sakshi

చిన్నారులపై కరోనా మహమ్మారి ప్రతాపం

తొలిదశలో నామమాత్రంగానే కేసులు

సెకండ్‌వేవ్‌లో 27 శాతం నమోదు

అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో సందడి నిల్‌

గత ఏడాది లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితం

ఈసారి కొద్దిరోజులు బడులకెళ్లిన పిల్

సాక్షి, సిటీబ్యూరో: మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశంలో హరివిల్లు విరిస్తే.. అవి తమ కోసమేనని ఆనందించే పిల్లలు సెకండ్‌వేవ్‌ కరోనా విజృంభణ నేపథ్యంలో ఆటపాటలకు వీడ్కోలు పలికారు. ఉరకలెత్తే ఉత్సాహానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. క్రీడా మైదానాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కాలనీలు, పార్కుల్లో సందడి లేకుండాపోయింది అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు అప్రకటిత స్వీయ కర్ఫ్యూ విధించుకున్నాయి. ఆట పాటలతో, ఆనందోత్సాహాలతో గడిపే చిన్నారులు మరోసారి నాలుగు గోడల్లో బందీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం బడులకు పరుగులు తీసిన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్‌ మహమ్మారి ఈసారి పిల్లలను సైతం వదలడంలేదు.

కరోనా ఈసారి పిల్లలపైనా ప్రతాపం చూపుతోంది. గత ఏడాది చిన్నారులపై కోవిడ్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం, ఇళ్లకే పరిమితం కావడంతో పిల్లలు పెద్దగా  వైరస్‌ బారిన పడలేదు. బయటకు వెళ్లి వచ్చే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచే  ఎక్కువగా పిల్లలకు వైరస్‌ వ్యాప్తి చెందింది. అదే సమయంలో తల్లిదండ్రులు చాలావరకు జాగ్రత్తలు తీసుకోవడంతో చిన్నారులు పెద్దగా వైరస్‌ బారిన పడలేదు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పిల్లలు, పెద్దల  రాకపోకలు బాగా పెరిగాయి. పెద్దవాళ్లతో కలిసి  షాపింగ్‌కు  వెళ్లడం, సినిమాలు, టూర్లు, పండగలు, వేడుకల్లో పాల్గొనడంతో చాలాచోట్ల పిల్లలు సైతం వైరస్‌ బారిన పడ్డారు. మూడు నెలలకుపైగా పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో మహమ్మారి చిన్నారులపై ప్రభావం చూపింది.

గ్రేటర్‌ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌ నాటికి 15 ఏళ్లలోపు పిల్లలు కేవలం 10 శాతం వైరస్‌కు గురి కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 27 శాతం మందికి వైరస్‌ సోకినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో తక్కువగా ఉన్న కోవిడ్‌ కేసులు మార్చిలో భారీగా పెరిగాయి. గత శనివారం ఒక్కరోజే 13 శాతం వరకు పిల్లల కేసులు నమోదయ్యాయి. 30 నుంచి 40 ఏళ్ల  వయసువారు ఈసారి ఎక్కువగా వైరస్‌ బారిన పడుతుండగా ఆ తర్వాత  స్థానంలో పిల్లలే ఉంటున్నట్లు సమాచారం. ఈ నెల 16న  ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల  ప్రకారం 21 నుంచి 30 ఏళ్ల వారు, ఆ తర్వాత  30 నుంచి 40 ఏళ్లవారు 21.6 శాతం చొప్పున ఉంటే  11 నుంచి  20 ఏళ్లలోపువారు 10.3 శాతం వరకు వైరస్‌కు గురి కావడం గమనార్హం. 11 ఏళ్లలోపు పిల్లలు 2.7 శాతం వరకు ఉన్నారు. పెద్దవాళ్లతో పోల్చుకుంటే  పిల్లల సంఖ్య  చాలా తక్కువే అయినా గతేడాది కంటే  ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల అపార్ట్‌మెంట్లు, విల్లాల్లోకి బయటి వారిని అనుమతించడంలేదు. కొన్ని చోట్ల  ‘తమ ఇంటికి రావద్దని, తాము సై తం ఎవరి ఇళ్లకే వెళ్లబోమని’ మర్యాదపూర్వకమైన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలను అపార్ట్‌మెంట్‌ కారిడార్లలోకి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిన్నా మొన్నటి దాకా  స్నేహితులతో గడిపిన చిన్నారులు ఇప్పుడు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top