
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది
వివరాల ప్రకారం.. పాతబస్తీలో గురువారం ఉదయం ప్లాస్టిక్ గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అనంతరం, మూడు అంతస్తు భవనంలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని రక్షించారు. అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిలో చిన్నారి కూడా ఉంది. దీంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అయితే, మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ డీఎఫ్‌ఓ వెంకన్న సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రమాదం జరిగిందని కాల్ వచ్చింది. వెంటనే ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. సెకండ్ ఫ్లోర్ లో ముగ్గురు బిల్డింగ్ పైన ఐదుగురు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చాము. మంటలు అదుపులోకి వచ్చిన ఇంకా స్మోక్ భారీగా వస్తుంది. బేగంబజార్‌లో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఇంట్లోనే గోదాం ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారు.
బట్టలు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో స్మోక్ ఎక్కువగా వస్తుంది. మరో గంటల్లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తాం. మనుషులు వెళ్లలేని చోటికి లేటెస్ట్ గా వచ్చిన రోబోను పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని అన్నారు.
