ఏపీ టీడీపీ నేతలతో రేవంత్‌రెడ్డి, వేంనరేందర్
మరోసారి చర్చనీయాంశమైన చంద్రబాబు ముసుగు రాజకీయం
పైకి ఎన్డీయేతో పొత్తు.. తెర వెనుక కాంగ్రెస్‌తో స్నేహం
మహిళా బిల్లు సందర్భంగా బట్టబయలైన బంధం
పార్లమెంట్‌లో టీడీపీ మంత్రులతో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
2011లోనూ నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని బాబు కలిసినట్లు వార్తలు
అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతోనూ బంధం
2018లో ఎన్డీయేలో ఉంటూనే కాంగ్రెస్‌తో చెట్టాపట్టాల్
2019 ఎన్నికల్లో ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకుని పోటీ..
ఓడిపోగానే మళ్లీ ఎన్డీయే గూటికి..
ఇప్పుడు అందులో ఉంటూనే కాంగ్రెస్‌తో దోస్తీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముసుగు రాజకీ యం మరోసారి చర్చనీయాంశమైంది. అవసరానికి తగ్గట్లుగా ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆరితేరిన ఆయన ఇప్పుడు ఎన్డీయేతో పొత్తులో ఉండి తెరచాటున కాంగ్రెస్‌తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో లోపాయకారీగా మంతనాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, నేతలతో కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఓ మంత్రి ఆహ్వానం మేరకు ఎన్డీయే ఇచ్చిన విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉంటూనే రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో గుట్టుగా దోస్తీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో రహస్య స్నేహం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 2024 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు కాంగ్రెస్‌కి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెరచాటున విశ్వప్రయత్నాలు చేసినట్లు బయటపడింది. ఏపీలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. బయటకు మాత్రం ఎన్డీయేతో పొత్టు పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్‌తో సంబంధాలు నెరిపారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో టీడీపీ మంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం బహిరంగ రహస్యమే. వారు తరచూ ఆయనతో విందు భేటీల్లో పాల్గొంటున్నట్లు బహిరంగ రహస్యం.
చంద్రబాబు కూడా రేవంత్‌కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను కోరిన మీదటే చంద్రబాబు నిలిపివేసినట్లు స్వయంగా రేవంత్‌రెడ్డి అక్కడి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టే చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అప్పట్లో తేటతెల్లమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఆయన ఎన్డీయేలో ఉండి తెరవెనుక కాంగ్రెస్‌తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది.
2011లో చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబు..
మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు కాంగ్రెస్‌తో రహస్య బంధం కొనసాగించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాత్రి వేళ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన యూపీఏ ప్రభుత్వంతో లోపాయకారీగా పలు వ్యవహారాలు నడిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అన్ని విధాలా సహకరించారు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోయేందుకు సహకరించి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. 2011–2013 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తెరచాటున కలిసి పనిచేశారు.
రాష్ట్ర విభజనలోనూ కాంగ్రెస్‌తో స్నేహం..
ఆ సమయంలోనే ఆంధ్రా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరుగుతున్నా చంద్రబాబు కాంగ్రెస్‌కే అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుని తన అవకాశవాదాన్ని చాటుకున్నారు. ఇక 20014–19 మధ్య కూడా ఎన్డీయేతో పొత్తులో ఉండి కాంగ్రెస్‌తో రహస్యం బంధాన్ని కొనసాగించారు.
2018లో ఆ ముసుగును తీసేసి ఎన్డీయే నుంచి బయటకొచ్చి యూపీఏతో స్నేహం చేశారు. అదే ఏడాది తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో యూపీఏతో అవగాహన కుదుర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే యూపీఏను వదిలేసి ఎన్డీయేకి జైకొట్టారు.
..ఇలా తన రాజకీయ అవసరాన్ని బట్టి రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లింది. ఇదే క్రమంలో తాజాగా ఎన్డీయేతో కలిసి ఉంటూనే బీజేపీకి అనుకూలంగా అన్నీ చేస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక మాత్రం కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.


