టార్గెట్‌ సెంథిల్‌! | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ సెంథిల్‌!

Published Wed, Jul 12 2023 9:32 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్‌ బాలాజీకి సంబంధించిన వారిని ఆదాయ పన్ను శాఖ అధికారులు టార్గెట్‌ చేశారు. వివరాలు.. మంత్రి సెంథిల్‌ బాలాజీని టార్గెట్‌ చేసి మే 26వ తేదీన కరూర్‌, కోయంబత్తూరు, మదురై తదితర 40కు పైగా ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాల్లో నిమగ్నమైంది. కరూర్‌లో అయితే అధికారులకు డీఎంకే వర్గాలు ముచ్చెమటలు పట్టించాయి. ఈ సోదాలు 8 రోజుల పాటు జరిగాయి. ఆ తదుపరి పరిణామాలతో సెంథిల్‌ బాలాజీని ఈడీ అరెస్టు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అయినా, ఐటీ అధికారులు మాత్రం సెంథిల్‌ బాలాజీ, ఆయనకు చెందిన వారిని వెంటాడుతున్నానే ఉన్నారు. జూన్‌ 13 నుంచి రెండు రోజులు, జూన్‌ 23వ తేదీ నుంచి మరో రెండు రోజులు కరూర్‌లో తనిఖీలు చేపట్టారు. కొన్ని చోట్ల కార్యాలయాలకు తాళం వేసి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కరూర్‌లో మళ్లీ ఐటీ అధికారులు 7 చోట్ల సోదాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో సెంథిల్‌ బాలాజీ మిత్రుడు రామన్‌, సుబ్రమణ్యన్‌ నివాసాలు, కార్యాలయాలతోపాటు, శక్తి హోటల్‌, శ్రీరామ్‌ విలాస్‌ హోటల్‌, రమేష్‌ ఫైనాన్స్‌, వివిన్‌ ఫ్యాక్టరీ ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌ భద్రత నీడలో తనిఖీలు సాగుతున్నాయి.

హోరాహోరీగా వాదనలు..
ఓవైపు ఐటీ దాడులు జరుగుతోంటే, మరో వైపు మంగళవారం హైకోర్టులో త్రిసభ్య బెంచ్‌ ముందు సెంథిల్‌ బాలాజీ సతీమణి మేఘల దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. మేఘల తరపున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఢిల్లీ నుంచి సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. చట్ట విరుద్ధంగా అరెస్టులు జరిగినట్లు వాదించారు. ఆధారాలు సేకరించక ముందే అరెస్టు చేశారని వివరించారు. ఈ సందర్భంగా మూడో న్యాయమూర్తి కార్తికేయన్‌ పలుప్రశ్నలను సంధించినట్లు తెలిసింది.

మధ్యాహ్నం సెంథిల్‌ బాలాజీ తరపున సీనియర్‌ న్యాయవాది ఎన్‌ఆర్‌ ఇళంగో వాదనలు వినిపించారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు కేవియేట్‌ పిటిషన్‌ వేయడం చర్చకు దారి తీసింది. మేఘల దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌లో ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులలో మార్పుల కోసం సెంథిల్‌ తరపున ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈడీకి సమాచారం అందింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, శాఖ లేని మంత్రిగా ఉన్న సెంథిల్‌ను ఆ పదవి నుంచి తప్పించడమే లక్ష్యంగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఢిల్లీలో గవర్నర్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement