‘వైభ‌వ్‌తో పోల్చ‌ద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు! | Yashasvi Jaiswal hilarious response to Vaibhav Sooryavanshi question | Sakshi
Sakshi News home page

‘వైభ‌వ్‌తో పోల్చ‌ద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!

Apr 29 2026 1:48 PM | Updated on Apr 29 2026 2:13 PM

Yashasvi Jaiswal hilarious response to Vaibhav Sooryavanshi question

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. పంజాబ్ విధించిన 223 ప‌రుగుల‌ భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఓపెన‌ర్లు జైస్వాల్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ అదిరిపోయే ఆరంభమివ్వ‌గా.. ఆఖ‌ర్లో శుభ‌మ్ దూబే, డొనొవ‌న్ ఫెరీరాలు దూకుడుగా ఆడి రాజ‌స్తాన్‌ను గెలిపించారు. 

మ్యాచ్ ముగిసిన అనంత‌రం జైస్వాల్ ఆరెంజ్ క్యాప్‌ను వైభ‌వ్ సూర్య‌వంశీకి అందించాడు. ఈ సంద‌ర్భంగా జైస్వాల్ వైభ‌వ్ సూర్య‌వంశీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.  అత‌డితో క‌లిసి బ్యాటింగ్ చేయ‌డం త‌న‌కు సంతోషాన్నిస్తుంద‌ని చెప్పాడు. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను వయసులో పెద్దోడిని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే నేనింకా చిన్నవాడినే. ఇక నా సహచర ఓపెనర్‌ వైభవ్ సూర్యవంశీతో నన్ను పోల్చద్దు. 

వయసులో అతడు నాకంటే ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడితో నన్ను పోలిస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోతున్నా. వైభవ్‌లో ఉన్న ప్రతిభ అసాధారణం.’ అని తెలిపాడు. కాగా జైస్వాల్‌ వయసు 24 ఏండ్లు కాగా.. వైభవ్‌ సూర్యవంశీకి 15 ఏండ్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మ్యాచ్‌ గెలవడంపై కూడా జైస్వాల్‌ స్పందించాడు. ‘ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ 'ఇంటెంట్' చాలా ముఖ్యం.  అందరూ ప్రతి మ్యాచ్‌లో రాణించాలంటే కుదరదు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. 

మేమంతా ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దానిని ఆచరణలో పెడితే సరైన సమయంలో ఫలితాలు వస్తాయని భావించాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉంది. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.

ఇక సీజన్‌లో జైస్వాల్ 9 మ్యాచ్‌ల్లో 306 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ 9 మ్యాచ్‌ల్లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ సహా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్‌.. ఎందుకంటే?

Advertisement
 
Advertisement
Advertisement