ఐపీఎల్ 2026 సీజన్ రెండో ఫేజ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సగం ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవగా.. వరుస పరాజయాలతో లక్నో సూపర్‌జెయింట్స్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచి పంజాబ్, ఆర్సీబీ, రాజస్తాన్, ఎస్ఆర్‌హెచ్ విజయాలతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
మరి రెండో సగం కూడా పూర్తయ్యేసరికి ఈ జట్లే టాప్-4లో ఉంటాయా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇదిలా ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఐపీఎల్ 19వ సీజన్‌కు సంబంధించి బెస్ట్ స్టేడియాల జాబితా (ఒకటి నుంచి పది వరకు)ను ఎక్స్ వేదికగా విడుదల చేశాడు.
ఆర్సీబీకి ఆడుతున్న హాజిల్‌వుడ్ తన హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి నంబర్‌వన్ స్థానాన్ని ఇచ్చాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మాత్రం హాజిల్‌వుడ్ 10వ స్థానం కేటాయించడం అతడిని చిక్కుల్లో పడేసినట్లయింది. తాను చెన్నై గ్రౌండ్‌లో ఆడటాన్ని ఆస్వాదించలేకపోయానని, అక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆఖరి స్థానం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.
హాజిల్‌వుడ్ ఇలా తమ హోంగ్రౌండ్‌కు ఆఖరి స్థానం ఇవ్వడంపై సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'నచ్చకపోతే వదిలేయాలి అంతేకాని ఇలా చెన్నై స్టేడియాన్ని అవమానించేలా ర్యాంక్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం' అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మన సన్‌రైజర్స్ హైదరాబాద్ హొంగ్రౌండ్ అయిన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి హాజిల్‌వుడ్ ఏడో ర్యాంక్ కేటాయించాడు.
హాజిల్‌వుడ్ టాప్-10 స్టేడియాలు..
1. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2. నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్
3. వాంఖడే స్టేడియం, ముంబై
4. హెచ్‌పీసీఏ స్టేడియం, ధర్మశాల
5. పీసీఏ స్టేడియం, మొహలీ
6. ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
7. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్
8. ఎక్నా స్టేడియం, లక్నో
9. అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
10. ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
ఐపీఎల్ 19వ సీజన్‌లో జోష్ హాజిల్‌వుడ్ ఆర్సీబీకి కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగులిచ్చిన 4 వికెట్లు తీసిన హాజిల్‌వుడ్ ఐపీఎల్‌లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు.
మొత్తంగా ఐపీఎల్‌లో హాజిల్‌వుడ్ 44 మ్యాచ్‌లాడి 65 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు నాలుగు వికెట్ల హాల్ అందుకున్నాడు. సీజన్‌లో ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్‌ను గురువారం గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
Hazlewood rankings Indian Stadiums:
Chinnaswamy is No. 1 ❤️
Ahmedabad has to be right up there 🙏
Meanwhile, Chennai too hot for me so no. 10 😂 pic.twitter.com/J0VaPtbY5B— Aditya Saha (@Adityakrsaha) April 29, 2026
చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!


