పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు.
ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్‌గా, ఫినిషర్‌గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్‌లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.
అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.
ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను.
గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్‌ను) నేర్చుకున్నాను.
ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు.
ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్‌ల్లో 186 స్ట్రైక్‌రేట్‌తో 279 పరుగులు సాధించాడు.


