WC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? పాక్‌ కెప్టెన్‌ ఏమన్నాడంటే

WC 2022: Babar Azam On Potential T20 WC Final Against India - Sakshi

ICC Mens T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌-2022 మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్తాన్‌ ఫైనల్‌కు సన్నద్ధమవుతోంది. కివీస్‌తో కీలక మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌ అందుకున్న బాబర్‌ ఆజం.. 53 పరుగులతో రాణించాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌తో పాటు మరో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సైతం 57 పరుగులతో మెరిశాడు. గత మ్యాచ్‌లలో అంతగా ఆకట్టుకోని ఈ ఓపెనింగ్‌ జోడీ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ ఫైనల్‌ చేరడంతో.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఓడించి పాక్‌తో పాటు తుది మెట్టుకు చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2007 నాటి వరల్డ్‌కప్‌ మాదిరి ఫైనల్లో దాయాదుల హోరాహోరీ పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు ఓ జర్నలిస్టు నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

జర్నలిస్టు:
మీరు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. అయితే, ఫైనల్లో ఇండియా మీ ప్రత్యర్థిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఇండియా- పాక్‌ మ్యాచ్‌ అంటే అంతా ఒత్తిడిలో కూరుకుపోతారు. అలాంటి పరిస్థితుల్లో మీరెలాంటి వ్యూహాలు అవలంబిస్తారు?

బాబర్‌ ఆజం:
నిజానికి ఫైనల్లో మా ప్రత్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పలేం కదా. అయితే, తుది పోరులో ఎవరితో పోటీ పడాల్సి వచ్చినా వందకు వంద శాతం మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకే ప్రయత్నిస్తాం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాం. ఫైనల్లో ఒత్తిడి సహజమే. 

అయితే, ఈ టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్‌ చేరే వరకు వివిధ దశల్లో కఠిన పరిస్థితులు దాటుకుని ఇక్కడి దాకా వచ్చాం. ఫైనల్లో కచ్చితంగా భయానికి తావులేకుండా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. గత మూడు, నాలుగు మ్యాచ్‌లలో మా ఆట తీరు అలాగే ఉంది. ఫైనల్లో కూడా అదే విధంగా ఆడతాం అంటూ బాబర్‌​ ఆజం సమాధానమిచ్చాడు.

ఈ నేపథ్యంలో పాక్‌ కెప్టెన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘లక్‌తో మీరు సెమీస్‌ వరకు రాగలిగారు. కివీస్‌ వైఫల్యం కారణంగా ఫైనల్‌కు చేరుకున్నారు. టీమిండియా అలా కాదు కదా! కష్టపడి ఇక్కడి దాకా వచ్చారు. ఫైనల్‌కు చేరుకుంటారు. రెడీగా ఉండండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Danushka Gunathilaka: మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్‌, రక్షణ కూడా లేకుండా అమానుషంగా

a

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top