అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్‌హెచ్ హ్యాట్రిక్ విజ‌యం | SRH Beat Delhi Capitals By 47 Runs Hat-trick Win In Home Ground | Sakshi
Sakshi News home page

అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్‌హెచ్ హ్యాట్రిక్ విజ‌యం

Apr 21 2026 11:52 PM | Updated on Apr 22 2026 7:26 AM

SRH Beat Delhi Capitals By 47 Runs Hat-trick Win In Home Ground

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. 

నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిల‌వ‌గా.. స‌మీర్ రిజ్వీ 41 ప‌రుగులు సాధించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (68 బంతుల్లో 135 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించ‌డంతో ఎస్ఆర్‌హెచ్ ఈ సీజ‌న్‌లో తొలిసారి 240 ప‌రుగుల ప్ల‌స్ మార్కును దాటింది. చివ‌ర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. హెడ్ 37, ఇషాన్ కిష‌న్ 25 ప‌రుగులు చేశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచ‌రీతో ఢిల్లీ ప‌ని ప‌ట్టిన అభిషేక్ శర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.

242లో స‌గం స్కోరు అభిషేక్‌దే..
టాస్ గెలిచి ఎస్ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించ‌డంతోనే ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శ‌ర్మ‌, హెడ్‌లు పోటీప‌డి బౌండరీలు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. ఆ త‌ర్వాత జ‌ట్టు స్కోరు 97 ప‌రుగుల వ‌ద్ద హెడ్ వెనుదిర‌గ‌డంతో ఎస్ఆర్‌హెచ్‌ తొలి వికెట్ కోల్పోయింది. 

మ‌రో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శ‌ర్మ త‌న విధ్వంసాన్ని కొన‌సాగించాడు. గ‌త రెండు మ్యాచ్‌ల్లో అర్థ‌శ‌త‌కాలు సాధించిన‌ప్ప‌టికీ వాటిని సెంచ‌రీలుగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడి సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 

చివ‌రి వ‌ర‌కు నిలిచిన అభిషేక్ క్లాసెన్‌, ఇషాన్‌ల‌తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాలు న‌మోదు చేశాడు. అయితే జ‌ట్టు సాధించిన 242 ప‌రుగుల్లో అభిషేక్ ఒక్క‌డివే 135 ప‌రుగులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అత‌డి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం.

త‌డ‌బ‌డిన ఢిల్లీ..
భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 ప‌రుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. అయితే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు వెనుదిర‌గ‌డం ఢిల్లీని క‌ష్టాల్లోకి నెట్టేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మిల్ల‌ర్ గోల్డెన్ డ‌కౌట్ కావ‌డంతో మ‌రింత క‌ష్టాల్లో ప‌డింది. 

ఈ ద‌శ‌లో స‌మీర్ రిజ్వీ, స్ట‌బ్స్ (27) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయ‌డంతో ఢిల్లీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా, సొంత‌గడ్డ‌పై మాత్రం హ్యాట్రిక్ విక్ట‌రీ. ఈ గెలుపుతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో ప‌రాజ‌యం. దీంతో ఆ జ‌ట్టు ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement