PAK VS ENG 1st Test: పాక్‌కు విషమ పరీక్ష.. పరుగుల వరద పారిన పిచ్‌పై ఫలితం తేలేలా ఉంది

PAK VS ENG 1st Test: England Set 342 Runs Target - Sakshi

రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్తాన్‌ విషమ పరీక్ష ఎదుర్కొంటుంది. ధాటిగా ఆడి రెండో ఇన్నింగ్స్‌ను 264/7 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసిన ఇంగ్లండ్‌.. పాక్‌ ముందు 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌ ఫలితంపై ఇరు జట్ల అభిమానులకు ఆశలు చిగురించాయి. 

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 5 పరుగుల వ్యవధిలో (20 పరుగుల వద్ద) తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరోలు అబ్దుల్లా షఫీక్‌ (6), బాబర్‌ ఆజమ్‌ (4) ఔటయ్యారు. రాబిన్సన్‌.. అబ్దుల్లాను బోల్తా కొట్టించగా, స్టోక్స్‌.. బాబర్‌ను పెవిలియన్‌కు సాగనంపాడు. రాబిన్సన్‌ బౌలింగ్‌లో అజహార్‌ అలీ (0) రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్ హాక్‌ (43), సౌద్‌ షకీల్‌ (24) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలవాలంటే ఆఖరి రోజు 263 పరుగులు (90 ఓవర్లు) చేయాల్సి ఉంటుంది. అదే ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 8 వికెట్లు పడగొడితే సరిపోతుంది.

కాగా, 499/7 స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌.. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 80 పరుగులు జోడించి 579 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. జాక్‌ క్రాలే (50), రూట్‌ (73), హ్యారీ బ్రూక్‌ (87) మెరుపు హాఫ్‌​ సెంచరీలతో చెలరేగడంతో 264/7 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  

ఇదిలా ఉంటే, బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీలతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అబ్దుల్లా షఫీక్‌ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్‌ ఆజమ్‌ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్‌) శతకాలతో చెలరేగడంతో పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top