ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో లక్నో 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 40 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. మిచెల్ మార్ష్ (55) మినహా లక్నో బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బదోని, పంత్, మార్క్రమ్ మరీ తీసికట్లుగా డకౌక్లయ్యారు.
ఈ సీజన్‌లో లక్నోను ఇది ఐదో ఓటమి. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ ప్రదర్శనలతో లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకోవాల్సిందే. ఈ సీజన్‌లో ఆ జట్టు బౌలింగ్‌లో సత్తా చాటుతున్నా, బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తుంది.
ఈ ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కెప్టెన్ పంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా విఫలమవుతున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. వరుస పరాజయాల తర్వాత నిరాశలో ఉన్నట్లు తెలిపాడు. బయట కారణాలు వెతక్కుండా, లోపలే పరిష్కారాలు వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు.
పిచ్ పరిస్థితులపై స్పందిస్తూ.. కొంచెం సమయం తీసుకుని ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇన్నింగ్స్‌ను మరింత లోతుగా తీసుకెళ్లాల్సిందని అన్నాడు. ఓటమికి సాకులు చెప్పకుండా, బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపాడు.
బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే అద్భుతంగా రాణించారని కితాబునిచ్చాడు. బౌలర్లు వారి పనిని సమర్దవంతంగా నిర్వర్తించారని, ఈ ఓటమి పూర్తిగా బ్యాటర్ల బాధ్యత అని అంగీకరించాడు.
వరుస ఓటములు ఎదురైనా ధైర్యం కోల్పోలేదని స్పష్టం చేశాడు. బౌలింగ్‌తో పాటు తమ జట్టు బ్యాటింగ్‌లోనూ బలంగా ఉందని అన్నాడు. ఇప్పటికీ పరిస్థితులను అనుకూలంగా సామర్థ్యం తమకుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టుగా తలెత్తుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.


