ఐపీఎల్ 2026లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమవుతున్నారు. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్ (లక్నో కెప్టెన్, 27 కోట్లు), లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు కెమరూన్ గ్రీన్ (కేకేఆర్, 25.2 కోట్లు), లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్ క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ (సీఎస్‌కే, 14.2 కోట్లు), ప్రశాంత్ వీర్ (సీఎస్‌కే, 14.2 కోట్లు), నికోలస్ పూరన్ (లక్నో, 21 కోట్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (ఎస్‌ఆర్‌హెచ్, 13 కోట్లు), ఆకిబ్ నబీ (ఢిల్లీ, 8.4 కోట్లు).. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా చాంతాడంత ఉంది.
ఈ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నారు. అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారంతా ఫ్రాంచైజీలకు దించుకోలేని భారంగా మారారు. వీరిని ఏం చేయాలో ఫ్రాంచైజీలకు పాలుపోవడం లేదు. ఒక మ్యాచ్ కాకపోతే మరో మ్యాచ్‌లోనైనా రాణిస్తారు అని ఆశ పెట్టుకోవడం తప్పిస్తే, వారు చేసేదేమీ లేదు.
ప్రస్తుతం ఇలాంటి వారి వల్ల ఎక్కువగా నష్టపోతున్న ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న పంత్, పూరన్‌పై దాదాపు 50 కోట్ల పెట్టుబడి ఉంది. వీరి ఈ మొత్తానికి కనీస న్యాయం చేయలేకపోతున్నారు. పంత్ ఒకటి అరా ఇన్నింగ్స్‌లతో బండి నెట్టుకొస్తుండగా.. పూరన్ మరీ దారుణంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ అయితే మరీ దారుణంగా (82) ఉంది.
గత సీజన్‌లో సిక్సర్ల వర్షం (40) కురిపించిన ఇతను ఈ సీజన్‌లో కేవలం మూడే సిక్సర్లు కొట్టాడు. ఇలాంటి వారు ఏ జట్టుకైనా భారమే. పంత్ పరిస్థితి పూరన్ కంటే కాస్త బెటర్ అని చెప్పాలి. 7 ఇన్నింగ్స్‌ల్లో అతను 147 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ద సెంచరీ ఉంది. మొత్తంగా పంత్ , పూరన్ కలిసి 49 కోట్లకు 198 పరుగులు చేశారు.
కేకేఆర్ గ్రీన్ విషయానికొస్తే.. ఇతను కూడా పంత్ తరహాలో మమ అనిపించాడు. ఈ సీజన్‌లో అతనాడిన 7 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 162 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు. ఇతనిపై కేకేఆర్ అతి భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడతాడని భావించింది. అయితే ఇతను గాయం పేరు చెప్పి అసలు బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపడం లేదు. యాజమాన్యం, అభిమానలు నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో గత 2-3 మ్యాచ్‌ల్లో ఏదో చేయాలంటే చేశాడు.
ఇక సీఎస్‌కే అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ విషయానికొస్తే.. ఈ ఇద్దరిలో ఆ ఫ్రాంచైజీ ఏం చూసిందో ఏమో తెలీదు కానీ, వేలంలో కోట్ల వర్షం కురిపించింది. అయితే ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి వీరు కనీస న్యాయం కూడా చేయడం లేదు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తారని అనుకుంటే, వచ్చిన అడపాదడపా అవకాశాలను జారవిడుచుకున్నారు.
ప్రశాంత్ వీర్ 2 మ్యాచ్‌ల్లో 49 పరుగులు, కార్తీక్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 25 పరుగులు మాత్రమే చేశారు. ఈ కార్తీక్ శర్మ పరిస్థితి అయితే మరీ దారుణం. భారీ హిట్టర్ అని ఓవర్ హైప్ అందుకున్న ఇతగాడు కనీసం బంతిని కనెక్ట్ చేసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు.
లియామ్ లివింగ్‌స్టోన్ విషయానికొస్తే.. ఇతగాడికి అవకాశాలు రావడమే తక్కువగా వచ్చాయి. వాటిని సైతం ఒడిసిపట్టుకోలేకపోయాడు. 2 మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణించడం ద్వారా ఐపీఎల్ అవకాశం దక్కించుకున్న ఆకిబ్ నబీ (ఢిల్లీ క్యాపిటల్స్) దారుణంగా నిరాశపరిచాడు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకొని ఉసూరుమనిపించాడు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే, ఈ సీజన్‌లో ఫ్రాంచైజీల జేబులకు మరో రూపంలోనూ చిల్లు పడింది. కోట్లు పోసి కొందరు ఆటగాళ్లకు కనీసం అవకాశాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. వేలం సమయంలో జట్టు సమీకరణలను అంచనాల వేయలేకపోయిన కొన్ని ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను భారీ మొత్తాలకు కొనుగోలు చేసి డగౌట్‌లో ఖాళీగా కూర్చోబెడుతున్నాయి.
కొందరేమో (స్టార్క్, ఇంగ్లిస్, కమిన్స్) గాయాలు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటివరకు జట్టుకు అందుబాటులోకి కూడా రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో కేకేఆర్ బౌలర్ మతీష పతిరణ (18 కోట్లు), జేసన్ హోల్డర్ (7 కోట్లు) తదితరులు ఉన్నారు.


