
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించారు.
ప్రపంచకప్ టోర్నీల్లో తమకంటే చిన్న జట్ల చేతుల్లో ఓడటం ఇంగ్లండ్‌కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ జట్టు పసికూనల చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. 1992లో జింబాబ్వే చేతిలో, 2011లో ఐర్లాండ్ చేతిలో, 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ టీమ్ ఊహించని ఎదురుదెబ్బలు తినింది.
వన్డే ప్రపంచకప్‌ల్లో పరిస్థితి ఇదైతే.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. 2022 ఎడిషన్‌లో హేమాహేమీలతో నిండిన ఇంగ్లండ్ టీమ్.. ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్రత్యక్షంగా ఇంగ్లండ్‌ను ఓడించనప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నాడు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి 2022 టీ20 వరల్డ్‌కప్ సీన్‌ను రిపీట్ చేస్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాగా, నిన్నటి (అక్టోబర్ 15) మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.