గర్భిణి మృతి..బంధువుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యమే కారణమా!
సిద్దిపేటజోన్: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందగా, అందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... చిన్నకోడూర్ మండలం చౌడారాం గ్రామానికి చెందిన గాడిచర్ల అశ్విని(26) రెండో కాన్పు కోసం ఐదు నెలలుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో వైద్యులు స్కానింగ్ కోసం కరీంనగర్‌కు రిఫర్ చేశారు. అక్కడ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి బాగాలేదని గుండెలో చిల్లు ఉందని అబార్షన్ చేయాలని సూచించారు. దీంతో శుక్రవారం సిద్దిపేటలోని ఆస్పత్రిలో అబార్షన్ చేశారు. ఈ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడంతో సమీపంలో ఉన్న మరో ఆస్పత్రిలో అశ్విని గర్భసంచిని తొలగించారు. ఈ సమయంలో పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అశ్విని మృతదేహాన్ని తీసుకొచ్చి సిద్దిపేటలో ప్రసవం కోసం చికిత్స పొందిన ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారికి నచ్చజెప్పారు.


