సర్కారు తీరుతోనే కరెంటు నష్టాలు

Discoms At A Loss Due Government Decisions Bandi Sanjay - Sakshi

పైగా ప్రజలపై భారం పడేలా చార్జీల పెంపు యత్నం: బండి సంజయ్‌ 

కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌కు 20 గ్రామాలకు సరిపడా కరెంటు ఉచితంగా వాడుతున్నారని ఆరోపణ 

సాక్షి, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నష్టాల్లో కూరుకుపోయాయని.. ఆ నష్టాలను పూడ్చేందుకు అడ్డగోలుగా కరెంటు చార్జీలను పెంచి జనంపై భారం వేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో జరిగిన బీజేపీ జోనల్‌ (ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలు) ముఖ్య నేతల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. అది అబద్ధమని చెప్పినా సరే.. పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయకుండా విద్యుత్‌ సంస్థలను నష్టాల్లోకి నెడుతున్నారు. పైగా ప్రజలపై రూ.6,200 కోట్ల కరెంటు చార్జీల భారం మోపే యత్నం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు ఉచిత విద్యుత్‌ అందుతోంది. 20 ఊళ్లకు సరిపడా కరెంటును ఆ ఒక్క ఫామ్‌హౌస్‌కు వాడుకుంటున్నారు..’’అని సంజయ్‌ ఆరోపిం చారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో మాట్లాడిందని.. పచ్చి బియ్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిందని వివరించారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తమ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టి బదనాం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికే జోనల్‌ సమావేశం నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, కేంద్ర పథకాలను వివరించడం గురించి చర్చించామన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్, ఆదిలాబాద్‌ ఎంపీలు అర్వింద్, బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, సీనియర్‌ నేతలు శివప్రకాశ్, ప్రేమేందర్‌రెడ్డి, శ్రుతి, ఆయా జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top