మోదీని ఓడించాలంటే.. అలా చేయాల్సిందే: ఏకే ఆంటోనీ

AK Antony: Need Support of Both Minority and Majority Communities to Fight Against Modi - Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఏకే ఆంటోనీ మనసులోని మాటను బయటపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీని ఓడించాలంటే వ్యూహాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ విజయం కోసం మైనారిటీలను మాత్రమే నమ్ముకుంటే కష్టమని కుండబద్దలు కొట్టారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ వారం ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అదే కాంగ్రెస్‌ ప్రయత్నం..
మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మైనారిటీ, మెజారిటీ రెండు వర్గాల మద్దతు అవసరమని ఆంటోనీ అన్నారు. హిందువులతో పాటు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి విదితమే. రాజకీయ ప్రయోజనాల కోసమే సాఫ్ట్ హిందుత్వ ధోరణిని కాంగ్రెస్‌ అవలంభిస్తోందని కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందుత్వపై బీజేపీకి మాత్రమే సర్వహక్కులు లేవని కాంగ్రెస్‌ వాదిస్తోంది. 


భారతీయులుగా చూడడం లేదు: మాలవియా

ఆంటోనీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవియా ట్విటర్‌లో స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు, భారతీయులు భారతీయులుగా కనబడటం లేదు. మెజారిటీ, మైనారిటీ, హిందూ, ముస్లింలుగా దేశ పౌరులు విభజించబడ్డారు. మోదీని ఓడించేందుకు మైనారిటీల మద్దతు సరిపోదు కాబట్టి హిందువులను కలుపుకుపోవాలని యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన ఏకే ఆంటోనీ పిలుపునిస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఎందుకు ఆలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంద’ని మాలవియా ట్వీట్‌ చేశారు. (క్లిక్‌ చేయండి: బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటే.. అఖిలేశ్‌ సంచలన వ్యాఖ్యలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top