భక్తులకు లేదు తోవ
రూ.200 టికెట్ భక్తులకు నాలుగు గంటలు పైగా దర్శన సమయం సహనం కోల్పోయి వాగ్వాదానికి దిగిన భక్తులు...బెదిరించిన పోలీసులు ఉచిత ప్రసాదం కొంతమందికే ... నడవలేక తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆర్టీసీ బస్సుల ప్రయాణికులు గతంతో పోల్చితే దూరంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్లు
కొండకు దూరంగా బస్టాండ్... భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఉచిత లడ్డూ ప్రసాదం కొంతమందికే...
వీఐపీలకు సేవ
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు వీఐపీల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ. 200, రూ.500 అభిషేక దర్శనం క్యూలైన్లను భక్తులు స్వామివారిని దర్శించుకున్నందుకు దాదాపు నాలుగు గంటల పాటు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీలతోపాటు అధికారుల కుటుంబ సభ్యులను పెద్ద సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. కింద నుంచి నేరుగా లిఫ్ట్ సదుపాయంతో వస్తున్న అధికారపార్టీ నేతలు, కార్యకర్తల వల్ల ఆ ప్రదేశంలో భారీ క్యూ కనిపించింది. ఈ సమయంలో శీఘ్ర ,అభిషేక దర్శనం క్యూలైన్‌ను నిలిపివేయడంతో భక్తులకు స్వామివారి దర్శనం ఆలస్యం అయింది.
పోలీసులతో భక్తుల వాగ్వాదం ..
స్వామి వారికి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందటంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వీవీఐపీల సేవలలోనే తరిస్తారా సామాన్య భక్తులను పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భక్తుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో పోలీసులు బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. మాకు ప్రోటోకాల్ ఉంటది ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ పోలీసులు భక్తులపై ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో మాట్లాడుతున్న భక్తులు పట్ల పోలీస్ అధికారులు అసభ్యకరంగా బూతుల దండకాన్ని అందుకున్నారు. కొంతసేపటి తర్వాత జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ అక్కడికి చేరుకొని వీ వీఐపీ దర్శనాలలో ఇతరులు రాకుండా చర్యలు తీసుకున్నారు.
ఆన్‌లైన్ టికెట్ల దర్శనం భేష్...
ఆలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంలో కొనుగోలు చేసే వీఐపీ టికెట్ల విధానం సత్ఫలితాలను ఇచ్చింది. గతంలో వీఐపీ పాసుల పేరుతో ఉచితంగా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టంతో పాటు సామాన్య భక్తులు ఇబ్బందిపడేవారు. ఈ ఏడాది వీఐపీ దర్శనానికి రూ.300 టికెట్ ను నిర్ణయించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దాదాపు 6 వేల మంది కి పైగా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి కేటాయించిన టైం స్లాట్ లో కొండకు వచ్చి స్వామివారిని శీఘ్రంగా దర్శించుకున్నారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే వీఐపీ క్యూ లైన్ భక్తులకు సకాలంలో దర్శనం కావడంతో ఈ ఏడాది ఖాళీగా కనిపించింది.
నరసరావుపేట నుంచి కోటప్పకొండ తిరుణాలకు వెళ్లిన భక్తులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నరసరావుపేట వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పెట్లూరువారి పాలెం రోడ్ లో నిలిపివేశారు. అక్కడ నుంచి కొండ దిగున ఘాట్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్ కు భక్తులు కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది. కిలోమీటర్‌కు పైగా ఉన్న బస్టాండ్‌కు చేరుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో లేని విధంగా నరసరావుపేట వైపు నుంచి వచ్చే బస్సులను దూరంగా నిలిపివేయటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. భక్తుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న అధికారుల తీరుపై మండిపడ్డారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏడాది నుంచి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల కోటప్పకొండకు వచ్చిన సమయంలో ప్రకటించారు. తిరునాళ్ల రోజు అందరికి స్వామి వారి ఉచిత ప్రసాదం అందజేస్తామన్నారు. అయితే ఆదివారం కొంతమందికే ఉచిత లడ్డూ ప్రసాదం అందింది. ఉదయం 11 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేసి తరువాత లడ్డూలు లేవంటూ నిలిపివేశారు. పలువురు భక్తులు దీనిపై ప్రశ్నించడంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పంపిణీని తిరిగి ప్రారంభించారు.
భక్తులకు లేదు తోవ


