తపోభూమి సత్రశాల
భక్తుల కొంగుబంగారం మల్లన్న స్వామి విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలం 11 ఆలయాల కొలువైన సత్రశాల దేవస్థానం
సత్రశాల(రెంటచింతల): పవిత్ర కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీగంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినానికి సిద్ధమైంది. అనాదిగా ఈ దేవస్థానం భక్తులపాలిట సంతాన మల్లయ్య స్వామిగా... కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. సంతానం కలగని మహిళ ఇక్కడ కొలువైన స్వామి వారిని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం (నమ్మకం). విశ్వామిత్ర మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. తాను చేస్తున్న కఠోర తపస్సును భగ్నం చేసిన కాకులను విశ్వామిత్ర మహర్షి ఆగ్రహంతో శపించడం వలనే ఈ ప్రాంతంలో కాకులు మచ్చుకై న కనిపించవు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శైవక్షేత్రంలో ప్రతిరోజు మల్లన్న స్వామికి దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మహాశివ రాత్రి పర్వదినం రోజు తెల్లవారు జామునుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం తరహాలో ఇక్కడ కూడా వివిధ సామాజక వర్గాలకు చెందిన సుమారు 20 అన్నదాన సత్రాలు ఉన్నాయి. మహాశివ రాత్రి పర్వదినం రోజున ఆయా సామాజక వర్గాలకు చెందిన వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తారు.
అతిపురాతనమైన శైవక్షేత్రం
రాష్ట్రంలోని అతిపూరతనమైన శైవ క్షేత్రాలలో సత్రశాల మల్లిఖార్జున స్వామి దేవస్ధానం ఒకటి. ఈ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల సైతం ప్రతిఏటా తరలివస్తుంటారు. మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్, పశర్లపాడు, జెట్టిపాలెం గ్రామాల మీదగా సత్రశాలకు చేరుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలోనే రామాలయం, కుమార స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్తరేశ్వరుని ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, కాలభైరువుని ఆలయం, అన్నపూర్ణదేవి ఆలయం, కాశీవిశ్వేరుని ఆలయం, వెంకటేశ్వరుని ఆలయం, చీకటి మల్లయ్య స్వామి ఆలయం, అమర లింగేశ్వర స్వామి ఆలయం, కృష్ణవేణి ఆలయం కొలువై ఉన్నాయి. దేవస్ధానానికి విచ్చేసిన భక్తులలో భక్తిపారవశ్యంతో ఆధ్యాత్మికభావం తోణికిసలాడుతుంది. ఆలయ ప్రాంగణంలో నున్న ఏకశిలనంది విగ్రహం, దేవస్థానం మాజీ చైర్మన్ వేముల పిచ్చయ్య నిర్మించిన అతి పెద్దదైన శివయ్య విగ్రహం, మాజీ దేవస్థానం చైర్మన్ బద్దూరి బ్రహ్మారెడ్డి చేతులమీదుగా ఏర్పాటు చేసిన స్పటిక శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు తెల్లవార్లు జాగారం చేస్తుంటారని దేవస్థానం కార్యనిర్వణాధికారి గాదె రామిరెడ్డి, దేవస్థానం చైర్మన్ గుండా వెంకట శివయ్య తెలిపారు.
తపోభూమి సత్రశాల


