మౌలిక వసతుల కల్పనకు కృషి
బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన కేతవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న తండాల వాసులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంపు గ్రామాలకు చెందిన గిరిజనులు మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్టీ కమిషన్ ను వినతి పత్రం అందజేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన కేతవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న వారి వద్దకు వెళ్లి జేసీ వారి సమస్యలు తెలుసుకున్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అటవీ ప్రాంతంలో ఎందుకు నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా తాండ వాసులు పునరావాస కేంద్రాల్లో పనులు లేక పూట గడవడం కష్టంగా ఉందని జేసీకి తెలిపారు. దాదాపుగా 150 కుటుంబాల వరకు స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని తమకు వచ్చిన వ్యవసాయం చేసుకుంటూ, చేపల వేట సాగిస్తూ జీవిస్తున్నామన్నారు. తమ నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులైన రహదారి, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. వివరాల నమోదు చేసుకుని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జేసీ వివరించారు. కార్యక్రమంలో సత్తనపల్లి ఆర్డీవో రమణ కాంత్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, అటవీశాఖ అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ సంజనా సింహ


