హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుండవరం(చేబ్రోలు): పాత కక్షలు, ఆస్తి గొడవల కారణంగా జరిగిన హత్యాయత్నం కేసులోని ముగ్గురు నిందితులను చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ పి వీరనారాయణ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల వెంకటేష్‌కు సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్‌ల మధ్య ఆస్తి, భూ వివాదాలు, పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్, తొడెమల వెంకట గోపిలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం వెంకటేష్‌పై కత్తితో దాడి చేశారు. బాధితుడికి మెడతోపాటు పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీ జనార్థనరావు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. నిందితులను గురువారం నారాకోడూరు మినీ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పి వీరనారాయణ తెలిపారు.
కోటప్పకొండకు 50 బస్సులు
చీరాల: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు చీరాల ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ జె.శ్యామల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోటప్పకొండకు ఆదివారం ఉదయం నుంచి చీరాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామన్నారు. అలానే చినగంజాం దగ్గర గల సోపిరాలకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.


