త్రుటిలో తప్పిన ప్రమాదం
రొంపిచర్ల: మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో బుధవారం తృటిలో ఓ ప్రమాదం తప్పింది. అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీ స్కూల్ బస్సును ఢీకొట్టబోయి, అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. స్కూల్ బస్ మాచవరం నుంచి విద్యార్థులతో బయలుదేరి నరసరావుపేట వైపు వస్తుంది. అదే మార్గంలో ఇసుక లారీ మాచవరం గ్రామానికి వెళుతుంది. నల్లగార్లపాడు ఊరి బయట రోడ్డు మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును తప్పించబోయిన ఇసుక లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదలలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటన ను చూసిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని లారీ డ్రైవర్‌ను నిలదీశారు. డ్రైవర్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లారీని అక్కడే నిలుపుదల చేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.


