చంద్రబాబు సర్కారు దగా | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారు దగా

Feb 9 2026 7:43 AM | Updated on Feb 9 2026 7:43 AM

చంద్ర

చంద్రబాబు సర్కారు దగా

చంద్రబాబు సర్కారు దగా

చంద్రబాబు పాలనతో రైతులకు తప్పని కష్టాలు సర్వేల పేరుతో సిబ్బందిపై పనిభారం నీరసంగా సాగుతున్న పంటల నమోదు ప్రక్రియ గడువులోగా నమోదు పూర్తవటంపై అనుమానాలు

లక్ష్యసాధనకు చర్యలు

తెనాలి: గుంటూరు జిల్లాలో తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో గల వ్యవసాయ సబ్‌ డివిజనులో 51,170 ఎకరాల విస్తీర్ణంలో రైతులు రబీ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో మొక్కజొన్న 26 వేలు, జొన్న 22 వేలు, మినుములు, పెసలు 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సబ్‌ డివిజనులో 43 రైతు సేవ కేంద్రాలు ఉండగా, 35 మంది వీఏఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. పంటల ఈ–క్రాప్‌ నమోదును డిసెంబరులో ఆరంభించారు. దుగ్గిరాలలో 19,918 ఎకరాలకు 10,965, తెనాలిలో 17,020 ఎకరాలకు 9,007, కొల్లిపరలో 14,232 ఎకరాలకు 6,553 ఎకరాలకు మాత్రమే ఈ–క్రాప్‌ నమోదు చేయగలిగారు. ప్రస్తుతానికి 26,526 ఎకరాలకే ప్రక్రియ పూర్తి అయింది.

ముంచుకొస్తున్న గడువు

ఈ–క్రాప్‌ నమోదుకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనుంది. ఆలోగా పూర్తి చేస్తారన్న భరోసా రైతులకు చిక్కటం లేదు. ఇందుకు ప్రధాన కారణం సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర రిజిస్ట్రేషను వంటి పనులను అప్పగించడమే. రోజూ మధ్యాహ్నం నుంచి సచివాలయ ఉద్యోగులు ఈ విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సచివాలయం పరిధిలోని వీఏఏలు ఉదయం తమ పనులతోపాటు మధ్యాహ్నం నుంచి సర్వే, రిజిస్ట్రేషను పనులకు వెళ్లాల్సి వస్తోంది. పనిభారంతో అవస్థలు పడుతున్నారు. తరచూ సర్వర్లు మొరాయిస్తుండటం మరో సమస్య. దీంతో ఈ–క్రాప్‌ నమోదు పనుల్లో జాప్యం జరుగుతోంది. గతంలో సచివాలయం నుంచే నమోదుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం తప్పనిసరిగా పొలాలకు వెళ్లి, పంట వివరం, రకం వంటివి నమోదు చేయాలి.

ఎన్నో ఉపయోగాలు

ఈ–క్రాప్‌ నమోదు రైతులకు ఎంతో కీలకం. మార్కెట్లో ధాన్యానికి ధరలు లేనపుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్‌ నమోదుతోనే అవకాశం ఉంటుంది. పంట రుణాలు తీసుకోవాలన్నా, పంటల బీమా చేసుకుని ఏదైనా ప్రకృతి విపత్తుతో పంట దెబ్బతింటే నష్టపరిహారం పొందటానికీ సదరు ఈ–క్రాప్‌ నమోదయితేనే వర్తిస్తుంది. అయినప్పటికీ మూడు మండలాల్లో సగం విస్తీర్ణంలో ఇంకా నమోదు చేయకపోవటంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సబ్‌ డివిజనులో రబీలో సాగవుతున్న పంటలకు ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నాం. గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ముందుకొచ్చి పంటల నమోదుకు తోడ్పడాలని కోరుతున్నాం.

– ఆర్‌.విజయబాబు, ఏడీఏ

గత ఖరీఫ్‌ సీజనులో మోంథా, దిత్వా తుపాన్లకు పంట నష్టపోయిన రైతులు ఎవరికీ పరిహారం అందనేలేదు. వరి పొలంలో 33 శాతం పైబడి పంట నష్టపోతేనే ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారాన్ని నిర్ణయించారు. తెనాలి మండలం కంచర్లపాలెంలో కొద్దిపాటి విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు నివేదిక పంపారు. పైసా పరిహారం అందలేదని చెబుతున్నారు. అలాగే 2024–25లో కొద్దిమంది రైతులకు తైవాన్‌ స్ప్రేయర్లు, ఆయిలింజన్లు, డ్రోన్లు, రోటావేటర్లు వంటి వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుత సంవత్సరానికి వీటి పంపిణీ నిమిత్తం బడ్జెట్‌ కేటాయింపే జరగలేదని అంటున్నారు. బాబు పాలనలో అన్ని రకాలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చంద్రబాబు సర్కారు దగా 1
1/1

చంద్రబాబు సర్కారు దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement